Maruti Fronx: బ్రెజ్జా, గ్రాండ్ విటారాలకు షాక్.. మారుతిలో నంబర్ 1 ఎస్‌యూవీ ఇదే
Maruti Fronx: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.
Maruti Fronx
Maruti Fronx: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. కంపెనీకి చెందిన పాపులర్ స్పోర్టీ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సొంత సంస్థకు చెందిన బ్రెజ్జా, గ్రాండ్ విటారా, విక్టోరిస్ వంటి ఎస్‌యూవీ మోడళ్లను వెనక్కి నెట్టి అత్యధికంగా అమ్ముడైన కార్లలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026) ఏకంగా 1,10,135 యూనిట్ల ఫ్రాంక్స్ కార్లు అమ్ముడవటం విశేషం.
ఫ్రాంక్స్ అమ్మకాల్లో 43 శాతం గ్రోత్
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 76,805 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఏకంగా 43.39 శాతం వృద్ధి నమోదు చేసి ఫ్రాంక్స్ అగ్రస్థానంలో నిలిచింది. కాంపాక్ట్ డిజైన్, స్పోర్టీ లుక్స్, అధునాతన ఫీచర్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకోవడమే దీని సక్సెస్‌కు కారణం. మరోవైపు సంస్థకు చెందిన మరొక ప్రముఖ ఎస్‌యూవీ 'బ్రెజ్జా' 80,516 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానానికి పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే బ్రెజ్జా విక్రయాలు 5.17 శాతం మేర స్వల్పంగా తగ్గాయి.
విక్టోరిస్ సంచలనం.. 1500 శాతానికి పైగా వృద్ధి
సెప్టెంబర్ 2025లో మార్కెట్లోకి అడుగుపెట్టిన విక్టోరిస్ మోడల్ అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 72,012 యూనిట్లు అమ్ముడై ఏకంగా 1,581.78 శాతం మేర బంపర్ గ్రోత్ సాధించింది. సేల్స్ పరంగా బ్రెజ్జా మోడల్‌కు గట్టి పోటీ ఇస్తూ మూడో స్థానంలో నిలిచింది. ఇక గ్రాండ్ విటారా 45,176 యూనిట్లతో 22.12 శాతం వృద్ధి నమోదు చేసి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ-విటారా, జిమ్నీ సేల్స్ వివరాలు
మారుతి సుజుకి తీసుకొచ్చిన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారా కూడా మంచి స్పందన సాధిస్తోంది. సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే ఈ కార్లు 10,051 యూనిట్లు అమ్ముడై ఐదో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన జిమ్నీ మోడల్ 3,221 యూనిట్ల అమ్మకాలతో 17.34 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తంగా చూస్తే మారుతి ఎస్‌యూవీల విక్రయాలు ఏడాది వ్యవధిలోనే 56.09 శాతం మేర పెరిగి మొత్తం 3,21,111 యూనిట్లకు చేరడం గమనార్హం.




