Maruti: ఆగండాగండి.. కార్ కొనే ప్లాన్ ఉందా? నెక్సా నుంచి 5 బంపర్ మోడళ్లు వస్తున్నాయి
Maruti: భారతీయ కార్ల మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రముఖ కార్త తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.
Nexa New Cars
Maruti: భారతీయ కార్ల మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రముఖ కార్త తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన ఎరీనా, నెక్సా అనే రెండు కీలక డీలర్‌షిప్‌ల ద్వారా మొత్తంగా 17 కార్ మోడళ్లు విక్రయమవుతున్నాయి. అందులో ఎరీనా డీలర్‌షిప్ ద్వారా తక్కువ ధరలో లభించే కార్లు ఎక్కువ మోతాదులో అమ్ముడవుతున్నాయి. అయితే ప్రీమియం అనుభూతిని అందించే నెక్సా విభాగంలో సేల్స్ కొంత తగ్గుముఖం పట్టడంతో, దాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కంపెనీ ఏకంగా 5 సరికొత్త కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
నెక్సా మోడళ్లకు కొత్త ఊపిరి
గత కొన్నేళ్లుగా నెక్సా అమ్మకాలు ఎక్కువగా బలేనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా మోడళ్లపైనే ఆధారపడ్డాయి. ఇగ్నిస్, సియాజ్ వంటి కార్ల సేల్స్ తగ్గడం నెక్సా నెట్‌వర్క్‌పై కొంత ప్రభావం చూపింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మారుతి సుజుకి తన సూపర్‌హిట్ మోడళ్లకు భారీ అప్‌డేట్స్ ఇవ్వనుంది. త్వరలోనే ఫ్రాంక్స్ మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో రాబోతోంది. అలాగే 2027 నాటికి ఎక్స్‌ఎల్6, గ్రాండ్ విటారాలలో కస్టమర్లను ఆకట్టుకునేలా పవర్‌ఫుల్ ఫీచర్లతో పెద్ద అప్‌డేట్స్ తీసుకురావడానికి ఇంజనీర్లు వేగంగా పని చేస్తున్నారు.
7-సీటర్ ఎలక్ట్రిక్ SUV
ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తన ముద్ర వేసేందుకు మారుతి నెక్సాను ప్రధాన కేంద్రంగా వాడుకుంటోంది. ఇప్పటికే ఈ-విటారా నెక్సా ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టగా, రాబోయే రోజుల్లో 3-రో కాన్ఫిగరేషన్‌తో కూడిన 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV (YMC కోడ్‌నేమ్)ని ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తోంది. 2027 నాటికి రోడ్డెక్కనున్న ఈ కారు పెద్ద కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. దీనితో పాటు ఫ్రాంక్స్ సెగ్మెంట్‌కి దిగువన కస్టమర్లకు అందుబాటు ధరలో ఉండే చిన్న సైజు ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ మోడల్‌ను కూడా తేవాలని ఆలోచిస్తోంది.
టైమ్‌లీ అప్‌డేట్స్‌తో దూసుకెళ్తున్న బాలెనో హవా
సమయానుకూలంగా కార్లను అప్‌డేట్ చేయడం ఎంత ముఖ్యమో ఇటీవల విడుదలైన బలేనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ నిరూపించింది. సెప్టెంబర్ 5న అమ్మకాలు ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 25,392 యూనిట్ల సేల్స్ సాధించి దేశంలోనే నంబర్-1 కారుగా నిలిచింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా డిజైన్, టెక్నాలజీ మార్చితే నెక్సా సేల్స్ ఏ స్థాయిలో ఉంటాయో బలేనో విక్రయాలు స్పష్టం చేశాయి. ఇదే జోరును రాబోయే కొత్త మోడళ్ల ద్వారా కూడా కొనసాగించాలని మారుతి భావిస్తోంది.
చిన్న పట్టణాలకూ నెట్‌వర్క్ సేవలు
కేవలం కొత్త కార్లు తేవడమే కాకుండా, నెక్సా నెట్‌వర్క్‌ను దేశమంతటా వేగంగా విస్తరిస్తున్నారు. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి చిన్న పట్టణాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏకంగా 600 నెక్సా స్టూడియో అవుట్‌లెట్లను ప్రారంభించాలనేది కంపెనీ లక్ష్యం. కేవలం తక్కువ ధర ఆధారంగా కాకుండా, ప్రీమియం క్వాలిటీ, అత్యాధునిక ఫీచర్లను కోరుకునే కస్టమర్లను ఆకర్షించడమే ఈ భారీ నెట్‌వర్క్ విస్తరణ ప్రధాన ఉద్దేశం. ఈ వ్యూహం ఫలిస్తే రాబోయే రోజుల్లో నెక్సా సేల్స్ రికార్డు స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.




