Maruti Suzuki New SUVs: లీటర్ పెట్రోల్‌తో 35 కిమీల మైలేజీ.. మారుతి నుంచి అదిరిపోయే 3 కొత్త ఎస్‌యూవీలు!
Maruti Suzuki New SUVs: మారుతి సుజుకి మూడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
Maruti Suzuki New SUVs: లీటర్ పెట్రోల్‌తో 35 కిమీల మైలేజీ.. మారుతి నుంచి అదిరిపోయే 3 కొత్త ఎస్‌యూవీలు!
Maruti Suzuki new SUVs: భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తక్కువ ధర, మెరుగైన మైలేజ్ కోరుకునే మధ్యతరగతి కుటుంబాల్లో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో కంపెనీ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. రాబోయే రోజుల్లో 3 కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీటిలో కొన్ని మోడళ్లు అత్యాధునిక హైబ్రిడ్ టెక్నాలజీతో లీటర్‌కు 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా సబ్-కాంపాక్ట్, మైక్రో ఎస్‌యూవీ విభాగాల్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి కార్లు అమ్మకాల్లో సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసే పనిలో పడింది.
రాబోయే 3 సంవత్సరాల్లో కంపెనీ అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా ఎస్‌యూవీలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లు, కొత్త టెక్నాలజీ కోరుకునే కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కార్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కొత్త మారుతి బ్రెజా ఫేస్‌లిఫ్ట్..
మారుతి సుజుకి నుంచి అత్యధిక ఆదరణ పొందిన ఎస్‌యూవీలలో బ్రెజా ఒకటి. దేశీయ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలుదారుల్లో ఈ కారుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు బ్రెజాను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కంపెనీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ, కొత్త ఫీచర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ మోడల్‌లో 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇంజన్‌ను మారుతి ఫ్రాంక్స్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.
దీంతో పాటు ప్రయాణికుల సెఫ్టీని మరింత మెరుగుపరిచేందుకు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఆధునిక సేఫ్టీ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉందని సమాచారం.
కొత్త మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్..
దేశీయ మార్కెట్లో మారుతి ఫ్రాంక్స్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన ఈ క్రాస్ఓవర్ కారు యువ కొనుగోలుదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి మిడ్‌లైఫ్ అప్‌డేట్ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మరింత ప్రీమియం డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లో కూడా ఆధునిక డిజిటల్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీని అందించనున్నట్లు సమాచారం.
ఆటోమొబైల్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో ఫ్రాంక్స్ లీటర్ పెట్రోల్‌కు 35 కిలోమీటర్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ మైలేజ్ అందించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే అధిక మైలేజ్ కోరుకునే కస్టమర్లకు ఈ కారు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారవచ్చు.
మారుతి కొత్త మైక్రో ఎస్‌యూవీ..
మైక్రో ఎస్‌యూవీ విభాగంలోనూ తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విభాగంలో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లకు మంచి డిమాండ్ ఉంది.
వీటికి పోటీగా మారుతి సరికొత్త మైక్రో ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారును Y43 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు ఆటోమొబైల్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
ఈ కొత్త మైక్రో ఎస్‌యూవీలో అనేక రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందించే అవకాశం ఉందని సమాచారం. మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్, కంప్రెస్డ్ బయో గ్యాస్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వంటి ఆప్షన్లను భవిష్యత్తులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మిడిల్ క్లాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కారును తీసుకొచ్చే అవకాశం ఉంది. ధరను కూడా అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ప్రయత్నించవచ్చని అంచనా. ప్రారంభ ధర సుమారు రూ.6.25 లక్షల వద్ద ఉండొచ్చని వార్తలు వస్తున్నప్పటికీ, కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మైలేజ్‌తో ప్రత్యర్థులకు చెక్ పెట్టేనా..?
భారతీయ కస్టమర్లు కారు కొనుగోలు చేసే సమయంలో ధరతో పాటు మైలేజ్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో మారుతి సుజుకికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని మరిన్ని కార్లకు విస్తరించడం ద్వారా కంపెనీ తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
లీటర్‌కు 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించే కార్లు నిజంగా మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
అయితే కొత్త మోడళ్ల లాంచ్ తేదీలు, ధరలు, ఇంజన్ ఆప్షన్లు, మైలేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మారుతి సుజుకి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.




