Budget Car: లీటరుకు 33.40 కిమీల మైలేజీ.. రూ. 3.70లక్షలకే మిడిల్ క్లాస్ మెచ్చిన బిందాస్ కార్

Budget Car: కేవలం రూ. 3.70 లక్షల ప్రారంభ ధరతో, లీటరుకు 33.40 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ, మధ్యతరగతి కుటుంబాల కలలను నిజం చేస్తోంది మారుతి సుజుకి ఆల్టో కె10.

Venkat
Published on: 15 April 2026 9:03 PM IST
Budget Car
X

Budget Car: లీటరుకు 33.40 కిమీల మైలేజీ.. రూ. 3.70లక్షలకే మిడిల్ క్లాస్ మెచ్చిన బిందాస్ కార్

Budget Car: భారతీయ రహదారులపై సామాన్యుడి నేస్తంగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి ఆల్టో కె10, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం రూ. 3.70 లక్షల ప్రారంభ ధరతో, లీటరుకు 33.40 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ, మధ్యతరగతి కుటుంబాల కలలను నిజం చేస్తోంది. అమ్మకాల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, తన ప్రాభవాన్ని ఏమాత్రం కోల్పోకుండా దూసుకుపోతోంది.

మారుతి సుజుకి ఆల్టో కె10..

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఆల్టో కె10 పేరు వినపడగానే గుర్తుకు వచ్చేది తక్కువ ధర, నమ్మకమైన ప్రయాణం. ముఖ్యంగా చిన్న కుటుంబాలు, మొదటిసారి కారు కొనాలనుకునే వారు ఈ కారును అమితంగా ఇష్టపడతారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విక్రయాల గణాంకాలు ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పాయి. ఈ ఏడాది మొత్తం 93,740 యూనిట్లు అమ్ముడవ్వడం విశేషం.

అమ్మకాల్లో తగ్గుదల..

గత ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోల్చితే ఈసారి విక్రయాల్లో 8 శాతం తగ్గుదల నమోదైంది. 2025 సెప్టెంబర్ వరకు ఉన్న ప్రతికూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ సమయంలో కార్లపై ఉన్న జీఎస్టీ రేట్లు మధ్యతరగతి వినియోగదారులకు కొంత భారంగా మారాయి. షోరూమ్‌లకు విచారణ కోసం వచ్చే కస్టమర్లు పెరిగినా, ధరల భారం వల్ల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలు అమ్మకాలు చాలా మందకొడిగా సాగాయి.

ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకున్న విక్రయాలు..

సెప్టెంబర్ 2025 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపిరి పోసింది. పన్నుల భారం తగ్గడంతో కారు ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు బ్యాంకు రుణాలపై ఈఎంఐలు తగ్గడం వినియోగదారులను మళ్లీ షోరూమ్‌ల వైపు మళ్లించింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు అంటే ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. పండుగ సీజన్ కూడా ఈ వృద్ధికి గణనీయంగా దోహదపడింది.

అద్భుతమైన మైలేజ్, ఆకర్షణీయమైన ధర..

ప్రస్తుతం మారుతి ఆల్టో కె10 ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ. 3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 5.45 లక్షల లోపే ఉంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 24.39 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్లు 24.90 కి.మీ మైలేజీని ఇస్తాయి. మరీ ముఖ్యంగా, సీఎన్‌జీ వేరియంట్ కిలోకు ఏకంగా 33.40 కి.మీ మైలేజీని అందిస్తూ ఇంధన ఖర్చులను భారీగా తగ్గిస్తోంది. తక్కువ నిర్వహణ ఖర్చులతో మెరుగైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఆల్టో కె10 నేటికీ తిరుగులేని ఎంపికగా నిలుస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story