Maruti Suzuki : లుక్ అదిరింది, ఫీచర్లు పెరిగాయి.. నయా అవతారంలో మారుతి బాలెనో, ఫ్రాంక్స్
Maruti Suzuki : మారుతి సుజుకి త్వరలోనే సరికొత్త బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ కార్లను లాంచ్ చేయనుంది.
Fronx Facelift
Maruti Suzuki : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ అత్యంత ప్రజాదరణ పొందిన రెండు కార్ల మోడళ్లను సరికొత్త అవతారంలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రారాజుగా వెలుగుతున్న బాలెనో, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను పరిచయం చేయబోతోంది. ఇటీవల కాలంలో ఈ రెండు కొత్త కార్లు భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో వీటి డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ వివరాలపై మార్కెట్లో భారీ ఆసక్తి నెలకొంది.
సరికొత్త ఫ్రంట్ లుక్, అధునాతన కేబిన్ ఫీచర్లు
రోడ్ టెస్టింగ్‌లో దొరికిన స్పై చిత్రాలను గమనిస్తే, బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ లుక్‌లో కంపెనీ భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నయా ఫ్రంట్ బంపర్, సరికొత్త గ్రిల్‌ను అందించారు. ఈ గ్రిల్ మధ్యలో ఎల్‌ఈడీ లైట్ బార్ లేదా క్రోమ్ స్ట్రిప్ రానుండగా, ఇది రెండు వైపులా ఉన్న డిఆర్‌ఎల్‌లను కలుపుతుంది. సైడ్ ప్రొఫైల్, అలాయ్ వీల్స్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, వెనుక వైపు కొత్త బంపర్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఇచ్చారు. లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ పాత మోడల్‌లాగే ఉన్నప్పటికీ, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సన్‌రూఫ్‌తో పాటు ఈసారి కొత్తగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందించే అవకాశముంది.
హై మైలేజ్ ఇచ్చే జెడ్-సిరీస్ కొత్త ఇంజిన్
ఇంజిన్ విభాగంలో మారుతి సుజుకి అతిపెద్ద మార్పు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో సరికొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ను జతచేయనున్నారు. ఇటీవల విడుదలైన కొత్త స్విఫ్ట్, డిజైర్ కార్లలో వాడిన పవర్‌ఫుల్ అండ్ ఎఫిషియంట్ ఇంజిన్ ఇదే. ఇది 81 బిహెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొత్త Z-సిరీస్ ఇంజిన్ వల్ల కారు మైలేజ్ మునుపటి కంటే చాలా ఎక్కువగా వస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టీ గ్యాంగ్‌బాక్స్ ఆప్షన్లు లభించనున్నాయి.
లెవెల్-2 ADAS, పవర్‌ఫుల్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ఫ్రాంక్స్
మరోవైపు మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా సరికొత్త గ్రిల్, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, సవరించిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ రానున్నాయి. ఈ కారులోని ప్రధాన అప్‌డేట్ ఏంటంటే.. సేఫ్టీ కోసం ఇందులో లెవెల్-2 ADAS ఫీచర్‌ను జతచేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మారుతి సుజుకి స్వయంగా డెవలప్ చేస్తున్న సరికొత్త సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందే మొదటి కారుగా ఫ్రాంక్స్ నిలవనుంది. 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా కొనసాగనుంది. ఈ నయా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మైలేజ్ విషయంలో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




