Maruti Suzuki: టాటా పంచ్‌కు షాక్.. నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్న మారుతి కారు

Maruti Suzuki: మారుతి సుజుకికి చెందిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ బాలెనో భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది.

CR Reddy
Published on: 9 Oct 2026 9:46 AM IST
Maruti Baleno
X

Maruti Baleno

Maruti Suzuki: మారుతి సుజుకికి చెందిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ బాలెనో భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2026 నెలలో జరిగిన దేశవ్యాప్త కార్ల విక్రయాలలో బాలెనో అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్ని నెలలుగా మొదటి స్థానంలో కొనసాగుతున్న టాటా పంచ్ హవాకు అడ్డుకట్ట వేస్తూ మారుతి బాలెనో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక్క నెలలోనే ఏకంగా 25,392 మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయడం విశేషం.

సంవత్సరాల వారీగా విపరీతమైన వృద్ధి

పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాలెనో గతేడదితో పోలిస్తే ఏకంగా 93 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2025లో ఈ కారు కేవలం 13,173 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఆగస్టు 2026 నెలలో 21,320 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచిన టాటా పంచ్, ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. పండగ సీజన్ ప్రారంభం కావడం, కొత్త ఫీచర్లతో రావడం బాలెనో అమ్మకాలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.

టాప్ 10 కార్ల జాబితా వివరాలు

సెప్టెంబర్ నెల కార్ల అమ్మకాల జాబితాలో టాటా నెక్సాన్ 20,456 యూనిట్లతో రెండో స్థానంలో నిలవగా, టాటా పంచ్ 20,333 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో మారుతి ఫ్రాంక్స్ (19,282), మారుతి వ్యాగన్ఆర్ (18,835), మారుతి డిజైర్ (17,754) నిలిచాయి. హ్యుందాయ్ క్రెటా (17,657), మారుతి స్విఫ్ట్ (17,399), మహీంద్రా స్కార్పియో (17,313), మారుతి ఎర్టిగా (16,911) తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి.

ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ వివరాలు

మారుతి బాలెనో విజయంలో దాని ఇంజిన్ పనితీరు, మైలేజ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 89bhp పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 22.35 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ 22.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. సిఎన్‌జి మోడల్ అయితే కేజీకి ఏకంగా 30.61 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

ధర, మార్కెట్ స్థానం

భారత మార్కెట్లో మారుతి బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.99 లక్షల వరకు ఉంటుంది. తక్కువ నిర్వహణ ఖర్చు, అత్యుత్తమ మైలేజ్, రీసేల్ వాల్యూ బాగుండటం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.