Maruti Baleno: కస్టమర్లకు షాకిచ్చిన మారుతి.. రెండు నెలల్లోనే భారీగా పెరిగిన పాపులర్ కారు ధర
Maruti Baleno: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులకు చేదు వార్త అందింది.
Maruti Baleno
Maruti Baleno: దేశీయ వాహన రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మారుతి సుజుకి బాలెనో మోడల్ కొనుగోలుదారులకు ఊహించని షాక్ తగిలింది. గత నెలలోనే ధరలు పెంచిన మారుతి సంస్థ, తాజాగా మరోసారి సవరించిన ధరలను అమల్లోకి తెచ్చింది. వాహన తయారీ వ్యయం పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తాజా ధరల పెంపుతో మారుతి బాలెనో ప్రారంభ ధర రూ.5.99 లక్షల నుంచి గరిష్టంగా రూ.9.47 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు చేరింది.
ఏ వేరియంట్‌పై ఎంత భారం పెరిగిందంటే?
ఈ పెంపులో బాలెనో టాప్-స్పెక్ ఆల్ఫా పెట్రోల్ ఎంటీ, ఆల్ఫా పెట్రోల్ ఏఎంటీ మోడళ్లపై అత్యధికంగా రూ.30,000 వరకు పెంచారు. ఎంట్రీ లెవెల్ సిగ్మా వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది మునుపటి లాగే రూ.5.99 లక్షల వద్ద అందుబాటులో ఉంది. జీటా పెట్రోల్ ఎంటీ, జీటా పెట్రోల్ ఏఎంటీ, జీటా సీఎన్‌జీ వేరియంట్ల ధరలు రూ.15,000 పెరిగాయి. అదేవిధంగా డెల్టా పెట్రోల్ ఎంటీ, డెల్టా పెట్రోల్ ఏఎంటీ, డెల్టా సీఎన్‌జీ మోడళ్లపై రూ. 7,500 వరకు పెంపును విధించారు.
పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు
మారుతి బాలెనో ప్రస్తుతం రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తోంది. 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ కిట్ మోడల్‌లో వినియోగదారులకు లభిస్తోంది. ఈ వాహనాల్లో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని కంపెనీ అందిస్తోంది. ఇంధన పొదుపులో మెరుగైన మైలేజ్ ఇస్తూ లగ్జరీ ఫీచర్లను అందించడం వల్ల భారత మార్కెట్‌లో ఈ మోడల్ అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తోంది.
త్వరలోనే రానున్న బాలెనో ఫేస్‌లిఫ్ట్
వచ్చే నెలలోనే బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్‌లోకి రాబోతున్న తరుణంలో ఈ ధరల పెంపు జరగడం గమనార్హం. రాబోయే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 10 ఇంచీల పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 1 అడాస్ సెక్యూరిటీ టెక్నాలజీతో పాటు సీఎన్‌జీ-ఏఎంటీ కాంబినేషన్ రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాలెనోతో పాటు మారుతి బ్రెజా సీఎన్‌జీ వేరియంట్లపై కూడా రూ.5,000 వరకు ధరలను పెంచారు. బ్రెజా ప్రారంభ ధర ప్రస్తుతం రూ.7.40 లక్షలు ఉండగా టాప్ మోడల్ ధర రూ.13.70 లక్షలుగా ఉంది.




