Maruti Suzuki: కార్ల మార్కెట్‌లో మారుతి సంచలనం.. ఐదేళ్లలో 7 కొత్త ఎస్‌యూవీలతో దండయాత్రే
Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మెగా ప్లాన్ వేసింది.
Maruti Suzuki
Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మెగా ప్లాన్ వేసింది. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు 60 వేల బుకింగ్స్ రావడంతో పాటు రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ నెలకొంది. ఈ క్రేజ్‌ను కొనసాగిస్తూ రాబోయే ఐదేళ్లలో ఏకంగా 7 కొత్త ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన క్షణం నుంచి మారుతి సుజుకి బ్రెజ్జాకు కస్టమర్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 60 వేలకు పైగా బుకింగ్స్ నమోదవ్వడం విశేషం. పండుగ సీజన్ నాటికి ఈ వాహనాలను కస్టమర్లకు సత్వరమే అందించేందుకు కంపెనీ ప్లాంట్లలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. వారానికి 6.5 రోజుల పాటు ప్లాంట్లను నడుపుతున్నప్పటికీ, ఇప్పటికీ రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. విక్టోరియాతో పాటు బ్రెజ్జా ఉత్పత్తిని సమన్వయం చేసుకోవడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో బాలెనో
మరోవైపు బలేనో మోడల్ కూడా మార్కెట్‌లో తన పట్టును నిలబెట్టుకుంటోంది. దేశంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి ఖచ్చితంగా బాలెనోనే కావడం విశేషం. ఈ పాపులర్ కారు ప్రారంభ ధర రూ.6.10 లక్షలుగా ఉంది. నూతన అప్‌డేట్‌లో కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు జోడించారు. స్విఫ్ట్, డిజైర్ మోడళ్లలో వాడే 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను దీనిలో అమర్చారు. ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ మోడల్‌లో తొలిసారిగా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్ అందించడం వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
రాబోయే ఐదేళ్లలో 7 కొత్త ఎస్‌యూవీల దండయాత్ర
ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు మారుతి సుజుకి భారీ వ్యూహాన్ని రచించింది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో మార్కెట్లోకి 7 సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేయనుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 27 లక్షల వాహనాలకు పెంచాలని నిర్ణయించింది. వివిధ దశల్లో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం సాధించాలని చూస్తోంది.
విద్యుత్ విప్లవంలో ఈ-విటారా సంచలనం
ఈవీ రంగంలో మారుతి తీసుకొచ్చిన విద్యుత్ ఎస్‌యూవీ ఈ-విటారాకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ రేంజ్, సాఫ్ట్‌వేర్ పనితీరుపై వాహనదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సాంకేతిక లోపాలు గానీ, రేంజ్ పరిమితులపై గానీ ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడం విశేషం. విభిన్న విభాగాల్లో కొత్త కొత్త మోడళ్లను తెస్తూ భారతీయ వినియోగదారుల మదిని గెలుచుకోవడానికి మారుతి శరవేగంగా అడుగులు వేస్తోంది.




