Maruti Suzuki Brezza : లాంచ్ కాకముందే బ్రెజ్జాకు భారీ క్రేజ్.. కారణం ఈ ఒక్క అప్‌డేటే..!

Maruti Suzuki Brezza : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో మారుతి సుజుకి 'బ్రెజ్జా' ఒకటి. ఇప్పుడు ఈ మోడల్‌ను సరికొత్త

G Krishna
Published on: 16 July 2026 1:42 PM IST
Maruti-Suzuki-Brezza
X

Maruti-Suzuki-Brezza

Maruti Suzuki Brezza : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో మారుతి సుజుకి 'బ్రెజ్జా' ఒకటి. ఇప్పుడు ఈ మోడల్‌ను సరికొత్త హంగులతో, సరికొత్త పవర్‌ఫుల్ ఇంజన్‌తో మార్కెట్లోకి తీసుకురావడానికి మారుతి సుజుకి రంగం సిద్ధం చేసింది. జూలై 24న అధికారికంగా లాంచ్ కానున్న 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్' కోసం కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి అధికారిక అరేనా డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లాంచ్‌కు ముందే ఈ కారుకు సంబంధించిన టీజర్లను విడుదల చేస్తూ మారుతి సుజుకి సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుతోంది.

ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కారును పూర్తిగా రీడిజైన్ చేయనప్పటికీ, ఎక్స్‌టీరియర్ , ఇంటీరియర్ పరంగా కంటికి కనిపించే ఎన్నో ఆకర్షణీయమైన మార్పులను కంపెనీ తీసుకువస్తోంది. ఇటీవల లీకైన ఫోటోల ప్రకారం రీడిజైన్ చేసిన సరికొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, అప్‌డేట్ చేసిన అద్భుతమైన ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్ , సరికొత్త డిజైన్‌తో కూడిన ఫోర్-స్పోక్ అలాయ్ వీల్స్ ఇందులో రానున్నాయి. ఇక కారు క్యాబిన్ లోపల కూడా సరికొత్త కలర్ స్కీమ్, కొత్త ట్రిమ్ ఆప్షన్లతో ఇంటీరియర్‌ను మరింత ప్రీమియంగా మార్చనున్నారు.

కేక పుట్టించే ఫీచర్లు.. లెవెల్-2 ADAS రక్షణ..

ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న గట్టి పోటీని తట్టుకునేందుకు వీలుగా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మారుతి సుజుకి ఎన్నో ఆధునిక ఫీచర్లను జోడించనుంది. ఇందులో భాగంగా పెద్దదైన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సౌకర్యం కోసం పవర్డ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వేసవి కాలంలో ఎంతగానో ఉపయోగపడే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ప్రీమియం ఫీల్‌ను ఇచ్చే ఆంబియంట్ లైటింగ్‌ను అందించనున్నారు. భద్రతను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లేలా లెవెల్-2 ADAS టెక్నాలజీని కూడా ఇందులో ఇవ్వబోతున్నారు. దీనితో పాటు పార్కింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ముందు భాగంలో కూడా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను ఈసారి జోడిస్తున్నట్లు టెస్ట్ మోడల్స్ ద్వారా స్పష్టమైంది.

సరికొత్త ‘టర్బో పెట్రోల్’ ఇంజన్

ఈ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధానమైన అంశం సరికొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్. మారుతి సుజుకి తన పాపులర్ 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కొత్త బ్రెజ్జాలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఇంజన్ 'ఫ్రాంక్స్' మోడల్‌లో అందుబాటులో ఉంది. ఇది 100 hp పవర్‌ను, 148 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేయనున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో టర్బో-పెట్రోల్ ఆప్షన్ లేని ఏకైక కారు బ్రెజ్జా మాత్రమే. ఈ కొత్త ఇంజన్ రావడంతో కారు పర్ఫార్మెన్స్ మరింత పెరగనుంది. దీనితో పాటు ప్రస్తుతం వస్తున్న 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ , సీఎన్‌జీ ఆప్షన్లను కూడా యథాతథంగా కొనసాగించనున్నారు. ముఖ్యంగా, సీఎన్‌జీ మోడల్‌లో సిలిండర్‌ను అండర్‌బాడీ లో అమర్చడం ద్వారా డిక్కీలో లగేజీ పెట్టుకోవడానికి పూర్తి స్థలం దొరికేలా మార్పులు చేయనున్నారు.

ధర, పోటీ ఎలా ఉండబోతోంది..

సరికొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ ఇంజన్‌తో వస్తున్నందున కొత్త బ్రెజ్జా ధర ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుండి రూ.12.86 లక్షల మధ్య ఉంది. భారత మార్కెట్లో అత్యంత రద్దీగా ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టబోతున్న ఈ కొత్త బ్రెజ్జా.. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ , కియా సైరోస్ వంటి గట్టి ప్రత్యర్థులతో తలపడనుంది. పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ కారు.. మరోసారి మార్కెట్లో సేల్స్ పరంగా దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story