Maruti Suzuki : మారుతికి కోర్టు షాక్.. కొత్త కారు ఇవ్వాల్సిందే.!
Maruti Suzuki : భారతదేశంలో ఇథనాల్ కలిపిన ఈ20 (E20) పెట్రోల్ వాడకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, ఛత్తీస్‌గఢ్ వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు
Maruti-Suzuki
Maruti Suzuki : భారతదేశంలో ఇథనాల్ కలిపిన ఈ20 (E20) పెట్రోల్ వాడకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, ఛత్తీస్‌గఢ్ వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేని కారును విక్రయించినందుకు గానూ, కస్టమర్‌కు కొత్త కారును ఇవ్వాలని, లేదంటే రూ. 20.50 లక్షల పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయాలని వాహన దిగ్గజం మారుతి సుజుకిని కోర్టు ఆదేశించింది. వాహన ఇంధన అనుకూలత (Vehicle Compatibility), ఈ20 పెట్రోల్ లింకుపై దేశంలోనే వెలువడిన మొదటి మేజర్ తీర్పుగా ఇది నిలిచింది. భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ ఇంధన విధానం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, వాహనదారుల హక్కుల పరంగా ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
అసలు ఏం జరిగిందంటే..?
రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేబ్తా అనే కస్టమర్ జూన్ 2024లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ జీటా+ మోడల్‌ను కొనుగోలు చేశారు. కారు కొన్న కొన్ని నెలల పాటు బాగానే సాగినప్పటికీ, సుమారు 21,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కారులో ఇంజన్ సమస్యలు మొదలయ్యాయి. కారు డ్యాష్‌బోర్డ్‌పై పదే పదే ఇంజన్ మాల్‌ఫంక్షన్ వార్నింగ్‌లు రావడం , ప్రయాణంలో కారు అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కస్టమర్ తన కారును పలుమార్లు అథరైజ్డ్ సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లగా, ప్రతిసారీ డీలర్‌షిప్ వారు కారు ట్యాంక్‌లో కలుషిత పెట్రోల్ ఉందని, దానివల్లే ఇంజన్ పాడైందని చెప్తూ ఇంధన ట్యాంక్‌ను క్లీన్ చేసి ఇచ్చేవారు. అయినా సమస్య అలాగే పునరావృతమైంది. ఒక దశలో కారు ఇంజన్‌ను పూర్తిగా మార్చాలని, అందుకు రూ. 5.30 లక్షల ఖర్చవుతుందని సర్వీస్ సెంటర్ వారు తేల్చి చెప్పారు. అంతేకాకుండా, కలుషిత ఇంధనం వల్ల జరిగిన నష్టం కాబట్టి ఇది వారంటీ కిందకు రాదని స్పష్టం చేయడంతో బాధితుడు రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.
కారు అమ్మిన తేదీ కాదు.. తయారు చేసిన తేదీ
ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు కారు తయారీ కాలక్రమం. కస్టమర్ ఈ కారును జూన్ 2024లో కొన్నప్పటికీ, ఈ గ్రాండ్ విటారా జనవరి 2023లోనే తయారైంది. భారత ప్రభుత్వ ఉద్గారాల , ఇథనాల్ రోడ్‌మ్యాప్ ప్రకారం ఏప్రిల్ 1, 2023 తర్వాత తయారయ్యే అన్ని సరికొత్త బీఎస్-6 ఫేజ్-2 వాహనాలు తప్పనిసరిగా ఈ20 ఇంధనానికి అనుకూలమైన మెటీరియల్‌తో తయారు కావాలి. అలాగే ఏప్రిల్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ20 పెట్రోల్ లభ్యతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆటోమొబైల్ రంగా నిబంధనల ప్రకారం పాత స్టాక్ కార్లను ఆఫర్లపై కొత్తగా అమ్మడం సహజమే అయినప్పటికీ, ఈ20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన కాలంలో, దానికి సపోర్ట్ చేయని పాత ఇంజన్ కారును కొత్త కారుగా విక్రయించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
కలుషిత ఇంధనమే కారణమన్న మారుతి వాదన
ఈ కేసు విచారణలో మారుతి సుజుకి , డీలర్‌షిప్ తమ తప్పు ఏమీ లేదని వాదించాయి. గ్రాండ్ విటారా కారు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైనదేనని కోర్టుకు తెలిపాయి. కారులో సమస్య రావడానికి కారణం ఇథనాల్ కాదని, కస్టమర్ వాడిన కలుషిత లేదా అడల్ట్రేటెడ్ ఇంధనమేనని పేర్కొన్నాయి. టెక్నీషియన్ల తనిఖీల్లో ఫ్యూయల్ సిస్టమ్ లోపల తెల్లటి జెల్ లాంటి పదార్థం కనిపించిందని, ఇది కల్తీ పెట్రోల్ వల్లే ఏర్పడుతుందని, ఇలాంటి బాహ్య కారణాలు వారంటీ పరిధిలోకి రావని కంపెనీ వాదించింది.
అసలు కారణాలు ఇవే..
మారుతి సుజుకి సమర్పించిన డిఫెన్స్‌తో కన్జ్యూమర్ కోర్టు ఏకీభవించలేదు. కస్టమర్ పదే పదే సర్వీస్ సెంటర్‌కు వెళ్లినప్పటికీ, ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత కూడా అదే సమస్య పదే పదే రావడం చూస్తే లోపం ఇంధనంలో లేదు, కారు అంతర్గత సాంకేతికతలోనే ఉందని కోర్టు పేర్కొంది. కారును 2024లో కొత్త కారుగా అమ్మినప్పటికీ, అది జనవరి 2023 నాటి పాత మోడల్ అని, ఆ సమయంలో తయారైన ఇంజన్ ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేదని కోర్టు నిర్ధారించింది. ప్రస్తుతం దేశంలోని పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ డిఫాల్ట్‌గా దొరుకుతున్నప్పుడు కస్టమర్ దాన్ని కొట్టించకుండా ఎలా ఉండగలరని ప్రశ్నించింది. మార్కెట్లో దొరికే ఇంధనానికి అనుకూలంగా లేని కారును అమ్మి, ఆ భారాన్ని కస్టమర్లపై నెట్టడం సేవా లోపం కిందకే వస్తుందని పేర్కొంది.
కోర్టు విధించిన భారీ జరిమానా, పరిహారం
ఈ కేసులో కస్టమర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన రాయ్‌పూర్ కన్జ్యూమర్ కోర్ట్, మారుతి సుజుకి , సదరు డీలర్‌షిప్‌కు ఈ క్రింది ఆదేశాలు జారీ చేసింది. బాధితుడి కారును తీసుకొని, దానికి బదులుగా పూర్తి ఈ20 ఇంధన అనుకూలత కలిగిన సరికొత్త గ్రాండ్ విటారా మోడల్‌ను 45 రోజుల్లోగా ఉచితంగా అందించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత 45 రోజుల్లో కారును భర్తీ చేయకపోతే, కారు కొнуగోలుకు అయిన పూర్తి మొత్తం రూ. 20.50 లక్షలను కస్టమర్‌కు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీనితో పాటు కస్టమర్ అనుభవించిన మానసిక క్షోభకు గానూ రూ. 1 లక్ష పరిహారంగా, కోర్టు వ్యాజ్య ఖర్చుల నిమిత్తం మరో రూ. 10,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఈ తీర్పు ఎందుకు అంత ప్రాధాన్యమైనది..
భారతదేశం బయో-ఫ్యూయల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగంగా పెంచుకుంటూ పోతోంది. ఈ తీర్పు ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టడం లేదు, కానీ మారిన ఇంధన వ్యవస్థకు అనుగుణంగా వాహనాలను మార్చాల్సిన బాధ్యత పూర్తిగా ఆటోమొబైల్ సంస్థలదేనని స్పష్టం చేస్తోంది. ట్రాన్సిషన్ పీరియడ్‌లో పాత స్టాక్ వాహనాలను కొనే కస్టమర్లకు ఈ తీర్పు పెద్ద ఊరటనిస్తుంది. భవిష్యత్తులో వాహనాల ఇంధన అనుకూలత సమస్యలపై వచ్చే కేసులకు ఈ జడ్జిమెంట్ ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.




