Maruti Suzuki : దేశంలోనే ఛీపెస్ట్ 7-సీటర్.. లీటరుకు 27కిమీ మైలేజ్.. ఏకంగా 14 లక్షల మంది కొనేశారు
Maruti Suzuki : మారుతి సుజుకి ఈకో 7-సీటర్ వ్యాన్ భారతదేశంలో 14 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది. రూ.5.20 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు కేజీ సీఎన్‌జీకి 26.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
maruti suzuki eeco
Maruti Suzuki : భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న కార్ల నుంచి భారీ ఎస్‌యూవీల వరకు ఈ కంపెనీ కార్లకు కస్టమర్లు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా వ్యాన్, బడ్జెట్ 7-సీటర్ విభాగంలో మారుతి సుజుకి ఈకో తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాల అవసరాలతో పాటు చిన్న తరహా వ్యాపారాలకు కూడా ఈ కారు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 2010లో మార్కెట్లోకి వచ్చిన ఈకో.. ఇప్పటివరకు ఏకంగా 14 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం ఈ వ్యాన్ సెగ్మెంట్ మార్కెట్లో మారుతి ఈకోకు ఏకంగా 90 శాతం షేర్ ఉండటం దీని పాపులారిటీకి నిదర్శనం.
మారుతి సుజుకి ఈకో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది. దేశీయంగా 10 లక్షల విక్రయాల మైలురాయిని దాటిన ఏకైక వ్యాన్‌గా ఇది రికార్డు సృష్టించింది. జనవరి 2025 నాటికే 12 లక్షల యూనిట్లు అమ్ముడవగా.. కేవలం 2025 ఒక్క సంవత్సరంలోనే కంపెనీ 1.45 లక్షల ఈకో కార్లను విక్రయించింది. ఇక ఈ ఏడాది 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కేవలం నాలుగు నెలల్లోనే 50 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు, అలాగే పెద్ద కుటుంబం ఉన్నవారు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్ కోసం ఈ కారును గుడ్డిగా నమ్ముతున్నారు.
మారుతి ఈకో డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, బాక్సీ స్టైల్‌లో ఉంటుంది. దీని హై రూఫ్ డిజైన్ వల్ల కారు లోపల కూర్చునే ప్రయాణికులకు మంచి హెడ్‌రూమ్ లభిస్తుంది. అలాగే దీనికున్న పెద్ద గ్లాస్ ఏరియా,వెనుక వైపు ఉండే స్లైడింగ్ డోర్లు కారును మరింత కంఫర్టబుల్‌గా మారుస్తాయి. కారు లోపల ఎక్కువ స్థలం ఉండటం వల్ల సామాగ్రిని తరలించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని కమర్షియల్ అవసరాలకు సైతం విరివిగా వాడుతున్నారు.
మారుతి ఈకోలో వినియోగదారుల రోజువారీ అవసరాలకు తగినట్లుగా అవసరమైన ఫీచర్లను కంపెనీ జోడించింది. ఇందులో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనర్ (AC), క్యాబిన్ హీటర్, ఆధునిక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. సాదాసీదా కారులా కనిపించినప్పటికీ, ప్రయాణాన్ని సుఖవంతం చేసేందుకు అవసరమైన అన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈకో వ్యాన్ మైలేజ్ పరంగా కస్టమర్ల జేబుకు అస్సలు భారం కాదని చెప్పవచ్చు. ఇందులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 80 బ్రేక్ హార్స్ పవర్ (bhp), 104.4 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడల్ లీటరుకు దాదాపు 19.7 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇక మైలేజ్ మరింత కావాలనుకునే వారి కోసం కంపెనీ ఇందులో సీఎన్‌జీ (CNG) ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈకో సీఎన్‌జీ వేరియంట్ కేజీ గ్యాస్‌కు ఏకంగా 26.8 కిలోమీటర్ల (దాదాపు 27 కిమీ) మైలేజ్ ఇస్తుంది. తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
గతంలో జరిగిన గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో మారుతి ఈకో పెద్దల రక్షణలో 0-స్టార్, పిల్లల రక్షణలో 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే సాధించింది. అప్పట్లో దీని బాడీ షెల్ అంత సురక్షితం కాదని తేలింది. అయితే ఆ తర్వాత కంపెనీ సేఫ్టీ పరంగా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ ఈకో మోడల్‌లో ప్రయాణికుల భద్రత కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చింది. దీనితో పాటు ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి అవసరమైన సేఫ్టీ ఫీచర్లను కూడా చేర్చడం విశేషం.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఈకో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.20 లక్షలుగా ఉంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.6.36 లక్షల వరకు ఉంటుంది. మార్కెట్లో దొరికే ఇతర 7-సీటర్ కార్ల ధరలతో పోలిస్తే ఇది సగం ధరకే లభిస్తుండటం విశేషం. తక్కువ ధర, భారీ మైలేజ్, ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, నమ్మకమైన మారుతి సర్వీస్ నెట్‌వర్క్ వెరసి ఈకో కారును మిడిల్ క్లాస్ పీపుల్స్ ఆల్‌టైమ్ ఫేవరెట్ ఛాయిస్‌గా మార్చేశాయి.




