Maruti Suzuki : పెట్రోల్ కష్టాలకు మారుతి చెక్.. జూన్ 5న దేశంలోనే మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ లాంచ్!

Maruti Suzuki : మారుతి సుజుకి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును విడుదల చేయనుంది. ఇది పూర్తిగా ఇథనాల్‌తో నడుస్తుంది.

CR Reddy
Published on: 25 May 2026 9:13 AM IST
maruti suzuki
X

maruti suzuki

Maruti Suzuki : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధిక కార్లను విక్రయించే దిగ్గజ సంస్థ మారుతి సుజుకి, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో సరిహద్దులను బద్దలు కొట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే పెట్రోల్, సిఎన్‌జి, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ (EV) కార్లతో దూసుకుపోతున్న మారుతి, ఇప్పుడు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో సరికొత్త కారును తీసుకువస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జూన్ 5వ తేదీన అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మారుతి సుజుకి తన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబోతోంది.

ఈ లాంచ్ భారత ఆటోమొబైల్ రంగానికి అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో వాణిజ్యపరంగా ఎలాంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ ఫోర్-వీలర్ అమ్మకానికి అందుబాటులో లేదు. ఈ రేసులో మారుతి సుజుకి అందరికంటే ముందుండటంతో దేశంలోనే ఈ టెక్నాలజీతో వచ్చే మొదటి కారుగా ఇది సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. పెట్రోల్ ధరల పెరుగుదలతో సగటు మధ్యతరగతి వాహనదారుడు సతమతమవుతున్న ఈ రోజుల్లో.. ఈ కారు ఒక పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అసలు ఏంటి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు?

సాధారణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు అంటే కేవలం పెట్రోల్ మీదే కాకుండా, ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో కూడా నడిచే ప్రత్యేక వాహనాలు. ఆటోమొబైల్ నివేదికల ప్రకారం, మారుతి తీసుకురాబోతున్న ఈ కొత్త కారు ఏకంగా E100 అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని కోసం కారులో సరికొత్త ఫ్యూయల్ సిస్టమ్, ప్రత్యేకమైన ఇంజన్ సెటప్, అప్‌గ్రేడెడ్ ఇగ్నిషన్ సిస్టమ్‌లను కంపెనీ డిజైన్ చేసింది. చెరకు పిప్పి, మొక్కజొన్న వంటి వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తారు కాబట్టి, ఇది పెట్రోల్ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుంది.

మారుతి సుజుకి, దాని మాతృ సంస్థ సుజుకి గత కొన్నేళ్లుగా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. గతంలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో కంపెనీ తన పాపులర్ మోడల్ ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను ప్రదర్శించింది. ఆ మోడల్ E85 అంటే 85 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచేలా రూపొందించబడింది. అయితే ఇప్పుడు భారత మార్కెట్ కోసం కంపెనీ ఏకంగా 100 శాతం ఇథనాల్‌ను సపోర్ట్ చేసే ఇంజన్‌తో రాబోతుండటం విశేషం.

మార్కెట్లోకి వ్యాగన్ఆర్ రూపంలో వచ్చే ఛాన్స్!

మారుతి సుజుకి తన అత్యధిక విక్రయాలు సాధించే వ్యాగన్ఆర్ కారును కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్‌గా గతంలో ఒక ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఆ ప్రోటోటైప్ కారు E20 నుంచి E85 వరకు ఎలాంటి ఇంధనానికైనా సపోర్ట్ చేసేలా ఉంది. అందువల్ల, జూన్ 5న మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన వ్యాగన్ఆర్ లేదా ఆల్టో, ఫ్రాంక్స్ లలో ఒకదానిని ఈ కొత్త ఇంజన్ ఆప్షన్‌తో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇథనాల్ ఆధారిత ఇంధనాన్ని వాడటం వల్ల పర్యావరణానికి కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది, దేశానికి పెట్రోల్ దిగుమతుల భారం తప్పుతుంది. అంతిమంగా వాహనదారుడికి జేబు భారం కూడా గణనీయంగా తగ్గుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story