Maruti Suzuki: మారుతి నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. సీఎన్జీ కార్లలోనూ ఇక ఆటోమేటిక్ గేర్లు

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి కార్ లవర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

CR Reddy
Published on: 20 Sept 2026 9:42 AM IST
Maruti CNG AMT Cars
X

Maruti CNG AMT Cars

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి కార్ లవర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు కేవలం పెట్రోల్ మోడళ్లకే పరిమితమైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని, ఇప్పుడు తమ అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ప్రముఖ సీఎన్జీ కార్లకు కూడా విస్తరించింది. ఇందులో భాగంగా బాలెనో, స్విఫ్ట్, డిజైర్ సరికొత్త సీఎన్జీ ఏఎంటీ వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో రోజూ ప్రయాణించే వారికి పదే పదే గేర్లు మార్చే ఇబ్బంది నుంచి పూర్తిగా విముక్తి లభించనుంది.

ఈ మూడు కార్ల ప్రారంభ ధరలు వేర్వేరుగా నిర్ణయించారు. సరికొత్త మారుతి స్విఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.92 లక్షలుగా ఉండగా, బాలెనో సీఎన్జీ ఏఎంటీ ధర రూ.8.32 లక్షల నుంచి, పాపులర్ సెడాన్ డిజైర్ సీఎన్జీ ఏఎంటీ ధర రూ.8.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్లన్నీ కూడా తమ మాన్యువల్ సీఎన్జీ వేరియంట్ల కంటే దాదాపు రూ.35,000 వరకు ఎక్కువ ధర కలిగి ఉన్నాయి. అయితే డ్రైవింగ్ సౌలభ్యం దృష్ట్యా ఈ అదనపు ధర చాలా తక్కువని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక మైలేజ్, ఇంజన్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ కార్లలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కిట్‌తో కలిసి అద్భుతమైన పవర్‌ను అందిస్తుంది. ముఖ్యంగా స్విఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ కిలోకు 35.34 కిలోమీటర్లు, అలాగే డిజైర్ సీఎన్జీ ఏఎంటీ ఏకంగా 36.47 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక బాలెనో సీఎన్జీ ఏఎంటీ కూడా 34.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. బూట్ స్పేస్‌లో సీఎన్జీ ట్యాంక్ ఉన్నప్పటికీ, స్పేర్ వీల్ ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయడం విశేషం. సస్పెన్షన్ సిస్టమ్‌ను కూడా కొత్త ఏఎంటీ సెటప్‌కు తగినట్లుగా పూర్తిగా రీట్యూన్ చేశారు.

భారత మార్కెట్లో సీఎన్జీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మారుతి ఈ భారీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 9 లక్షల సీఎన్జీ కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మార్కెట్లో మారుతికి చెందిన 15 రకాల ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా వచ్చి చేరడంతో, మైలేజ్‌తో పాటు డ్రైవింగ్ కంఫర్ట్ కోరుకునే కస్టమర్లకు ఇవి బెస్ట్ ఆప్షన్‌గా నిలవనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.