Maruti Suzuki: ఆగస్టులో ఏకంగా 2.19 లక్షల కార్ల విక్రయం.. మారుతి సుజుకి సేల్స్‌లో సరికొత్త రికార్డు

Maruti Suzuki: దేశంలో కార్ల అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఆగస్టు నెలలో రికార్డు స్థాయి విక్రయాలతో సంచలనం సృష్టించింది.

CR Reddy
Published on: 2 Sept 2026 8:12 AM IST
Maruti Suzuki
X

Maruti Suzuki

Maruti Suzuki: దేశంలో కార్ల అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఆగస్టు నెలలో రికార్డు స్థాయి విక్రయాలతో సంచలనం సృష్టించింది. ఏకంగా 21.3 శాతం వార్షిక వృద్ధితో 2,19,220 వాహనాలను విక్రయించి సత్తా చాటింది. మన దేశంలో ఎస్‌యూవీల మోజు పెరగడం, పండుగల సీజన్ ముందస్తు ఉత్సాహం ఈ భారీ విక్రయాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మారుతి సుజుకి సాధించిన ఈ అద్భుతమైన విజయంలో మన దేశీయ మార్కెట్ కీలక పాత్ర పోషించింది. ఆగస్టు నెలలో లైట్ కమర్షియల్ వాహనాలతో కలిపి దేశీయ విక్రయాలు 34.3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. గత ఏడాది ఆగస్టులో 1,34,050 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి అది 1,80,078 యూనిట్లకు చేరింది. కస్టమర్లు మారుతి బ్రాండ్ పై చూపిస్తున్న ఆదరణకు ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఎస్‌యూవీలకు పెరిగిన విపరీతమైన క్రేజ్

ప్యాసింజర్ వాహనాల విభాగంలో కంపెనీ ఏకంగా 34.8 శాతం వృద్ధిని సాధించి 1,76,971 కార్లను రోడ్లపైకి తెచ్చింది. ఇందులోనూ ఎస్‌యూవీలు, యుటిలిటీ వాహనాల వాటా అత్యధికంగా ఉండటం విశేషం. ఈ కేటగిరీ విక్రయాలు 46.3 శాతం పెరిగి 79,045 యూనిట్లకు చేరుకున్నాయి. బ్రెజ్జా, ఎర్టిగా, ఈ వితారా, ఫ్రాంక్స్, గ్రాండ్ వితారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, ఎక్స్‌ఎల్6 వంటి మోడళ్లకు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభించింది.

చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల జోరు

కేవలం పెద్ద ఎస్‌యూవీలు మాత్రమే కాకుండా, రోడ్లపై నిత్యం కనిపించే ఎంట్రీ లెవెల్ కార్ల విక్రయాలు కూడా పుంజుకున్నాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్ల అమ్మకాలు గత ఏడాది 6,853 యూనిట్ల నుంచి ఈసారి 8,799 యూనిట్లకు పెరిగాయి. మరొకవైపు డిజైర్, స్విఫ్ట్, బాలెనో, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్, సియాజ్ వంటి మోడళ్ల విక్రయాలు 59,597 మోడళ్ల నుంచి 77,166 యూనిట్లకు చేరడం విశేషం.

ఎగుమతులలో స్వల్ప నిరాశ

దేశీయంగా సత్తా చాటినప్పటికీ, విదేశాలకు చేసే ఎగుమతుల విషయంలో కంపెనీ కొంత వెనుకబడింది. ఆగస్టులో ఎగుమతులు 7.4 శాతం తగ్గి 33,844 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఐదు నెలల కాలంలో ఎగుమతులు 14.2 శాతం పెరిగి 1,88,636 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లోనే మొత్తం విక్రయాలు 11,43,365 యూనిట్లకు చేరుకుని, 11 లక్షల మార్కును దాటేశాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story