Maruti Suzuki: మిడిల్ క్లాస్ ఫేవరెట్ కారు బ్రాండ్.. ఒక్క నెలలోనే లక్షా 81 వేల కార్లతో రికార్డ్

Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

CR Reddy
Published on: 2 Oct 2026 9:15 AM IST
Maruti Suzuki Sales
X

Maruti Suzuki Sales

Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరసమైన ధరల్లో కార్లను అందిస్తున్న ఈ దిగ్గజ కంపెనీ సెప్టెంబర్ 2026లో ఏకంగా 1,81,838 ప్రయాణికుల వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,32,820 కార్లతో పోలిస్తే ఇది దాదాపు 36.91 శాతం అధికం. అలాగే ఆగస్టు నెలతో పోలిస్తే అమ్మకాల్లో 2.75 శాతం వృద్ధి నమోదైంది. పండగ సీజన్ ప్రారంభం కావడం ఈ భారీ విక్రయాలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఎస్‌‌యూవీలు, యుటిలిటీ వాహనాల జోరు

కంపెనీకి చెందిన ఎస్‌యూవీలు, యుటిలిటీ వాహనాల విభాగం అద్భుతమైన వృద్ధిని సాధించింది. బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ లభించింది. ఈ సెగ్మెంట్‌లో గతేడాది సెప్టెంబర్‌‌‌‌తో పోలిస్తే ఏకంగా 62.05 శాతం వృద్ధి నమోదై 78,911 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, బాలెనో వంటి మినీ, కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 24.02 శాతం పెరిగి 91,887 యూనిట్లకు చేరుకున్నాయి. ఈకో వ్యాన్ అమ్మకాలు కూడా పది వేల యూనిట్లను దాటాయి.

ఎగుమతులు, ఇతర వాహనాల అమ్మకాల్లోనూ వృద్ధి

కేవలం దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా విదేశాలకు చేసే ఎగుమతుల్లోనూ మారుతి ముందంజలో నిలిచింది. సెప్టెంబర్ నెలలో కంపెనీ ఎగుమతులు 4.77 శాతం పెరిగి 44,219 యూనిట్లకు చేరాయి. లైట్ కమర్షియల్ వెహికల్ కార్ల విక్రయాలు కూడా సుమారు 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే టొయోటా కంపెనీకి జరిగే విడిభాగాల సరఫరా కొంత తగ్గింది. రాబోయే గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ రాకనే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయి అమ్మకాలు

జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాగిన మూడో త్రైమాసికంలో మారుతి సుజుకి ప్రదర్శన అత్యంత అద్భుతంగా ఉంది. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ మొత్తం 6,96,654 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 26.46 శాతం ఎక్కువ. దేశీయ ప్రయాణికుల వాహనాల విక్రయాలు 38.11 శాతం దూసుకెళ్లాయి. పండగ సమయం దగ్గర పడుతుండటంతో రాబోయే రోజుల్లో కార్ల విక్రయాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.