Maruti Suzuki: పెద్ద స్కెచ్ వేసిన మారుతి.. ఖంగుతిన్న ప్రత్యర్థి కంపెనీలు

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ గ్రీన్ మొబిలిటీ రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది.

CR Reddy
Published on: 20 Sept 2026 9:57 AM IST
Maruti Suzuki
X

Maruti Suzuki

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ గ్రీన్ మొబిలిటీ రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎన్జీ మార్కెట్‌లో దాదాపు 70 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కంపెనీ, రాబోయే 365 రోజుల్లో (ఫైనాన్షియల్ ఇయర్ 2027 నాటికి) ఏకంగా 10 లక్షల గ్రీన్ వెహికల్స్‌ను విక్రయించాలని అత్యంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు, కస్టమర్ల మారుతున్న రుచులకు తగ్గట్టుగా కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకుంది.

ఇటీవల మారుతి సంస్థ అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్, బాలెనో కార్లలో సరికొత్త ఎస్‌-సీఎన్జీ టెక్నాలజీతో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థ బెనర్జీ మాట్లాడుతూ.. గతంలో సీఎన్జీకార్లలో ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ లేకపోవడం వల్ల కొద్దిమంది కస్టమర్లు వెనకడుగు వేసేవారని, కానీ ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. సీఎన్జీ తక్కువ రన్నింగ్ కాస్ట్, ఆటోమేటిక్ కారు డ్రైవింగ్ సౌకర్యాన్ని కోరుకునే కొత్త తరం కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ మోడళ్లను లాంచ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ, కార్ల ఉత్పత్తి సామర్థ్యం విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని మారుతి స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ ప్రతి నెలా దాదాపు 80,000 సీఎన్జీ కార్లను విక్రయిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సీఎన్జీ కార్ల వాటా దాదాపు 43 శాతంగా ఉంది. సరఫరా మరింత మెరుగైతే ఈ వాటా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయిటింగ్ పీరియడ్ ఆధారంగా కార్లను కేటాయిస్తున్నామని, భవిష్యత్తులో ప్రొడక్షన్ మరింత పెంచితే అమ్మకాలు మరింత దూసుకెళ్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ముఖ్యంగా మారుతి డిజైర్ ఆటోమేటిక్ ఎస్‌-సీఎన్జీ కారు కిలోకు ఏకంగా 36.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ దేశంలోనే అత్యధిక ఇంధన సామర్థ్యం గల సెడాన్‌గా రికార్డ్ సృష్టించింది. మిగతా స్విఫ్ట్, బాలెనో ఆటోమేటిక్ సీఎన్జీ కార్లు కూడా అద్భుతమైన మైలేజ్‌ను అందిస్తున్నాయి. ఈ సరికొత్త ఆటోమేటిక్ సీఎన్జీ కార్ల రాకతో గ్రీన్ మొబిలిటీ రంగంలో మారుతి తన ఆధిపత్యాన్ని మరింత చాటుకుంటూ, లక్షలాది మధ్యతరగతి కుటుంబాల డ్రీమ్ కార్‌గా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.