Maruti Wagon R Flex Fuel: పెట్రోల్ తిప్పలు తప్పుతాయి.. మారుతీ సుజుకీ తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్' వ్యాగనార్ కారు వచ్చేసింది!
Maruti Wagon R Flex Fuel: భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం. మారుతీ సుజుకీ తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు 'వ్యాగనార్' (WagonR)ను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి సమక్షంలో ఆవిష్కరించింది.
Maruti Wagon R Flex Fuel: పెట్రోల్ తిప్పలు తప్పుతాయి.. మారుతీ సుజుకీ తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్' వ్యాగనార్ కారు వచ్చేసింది!
Maruti Wagon R Flex Fuel: దేశంలో ముడిచమురు (క్రూడాయిల్) దిగుమతులను తగ్గించి, పర్యావరణ అనుకూల ఇథనాల్ వినియోగాన్ని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఆటోమొబైల్ దిగ్గజాలు అడుగులు వేస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (జూన్ 5) పురస్కరించుకుని ఇప్పటికే హీరో మోటోకార్ప్ రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లను లాంచ్ చేయగా.. తాజాగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన మొట్టమొదటి ఫ్లెక్స్ప్యూయల్ కారు వ్యాగనార్ (WagonR) ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కలిసి గురువారం (జూన్ 4) ఢిల్లీలో ఈ సరికొత్త కారును అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ ప్రతిష్టాత్మక ఆవిష్కరణ సందర్భంగా మారుతీ సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషీ టకేయుచి మాట్లాడుతూ.. భారతదేశ ఇంధనరంగంలో ఇదొక సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకోవడం, కర్బన ఉద్గారాలను (కార్బన్ ఎమిషన్స్) అదుపు చేయడం భారత్ ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ రెండింటికీ ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత సరైన పరిష్కారం చూపుతుంది.
బయో ఫ్యూయల్, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లేలా ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. ఈ ఫ్లెక్స్‌ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల కేవలం ఆటోమొబైల్ రంగానికే కాకుండా, దేశీయ రైతులకు, ఇథనాల్ ఉత్పత్తిదారులకూ భారీగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు.
వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రత్యేకతలు & అంచనా ధర
ఈ కారులో 1.2 లీటర్ల శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ అమర్చారు.
ఇది సాధారణ పెట్రోల్‌తో పాటు ఏకంగా 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండ్ చేసిన E85 ఫ్యూయల్ తోనూ చాలా సులువుగా నడుస్తుంది.
బాహ్య రూపం (డిజైన్) పరంగా ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న E20 మోడల్ కార్లను పోలి ఉంటుంది.
కంపెనీ ఇంకా అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ, మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.50 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును విజయవంతంగా లాంచ్ చేసిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో మారుతీ సుజుకీ కంపెనీ షేర్లు రాణించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో మారుతీ షేరు 1.5 శాతం లాభపడి గరిష్టంగా రూ.13,250 కి చేరింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.50 గంటల సమయానికి స్వల్ప లాభాల స్వీకరణతో దాదాపు ఒక శాతం లాభంతో రూ.13,152 వద్ద ట్రేడవుతోంది.




