Car Sales: డిజైర్, ఎర్టిగా కాదు.. రూ. 5 లక్షల బడ్జెట్‌లో 25 కిమీ మైలేజ్ ఇచ్చే ఈ కారే నంబర్ 1
Car Sales: భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న మారుతి సుజుకి ఆగస్టు 2026 మోడల్ వారీ విక్రయాల గణాంకాలను వెల్లడించింది.
Car Sales
Car Sales: భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న మారుతి సుజుకి ఆగస్టు 2026 మోడల్ వారీ విక్రయాల గణాంకాలను వెల్లడించింది. ఈ జాబితాలో ఎర్టిగా, ఫ్రాంక్స్ లాంటి పెద్ద కార్లను వెనక్కి నెట్టి మారుతి వ్యాగన్ఆర్ అత్యధిక విక్రయాలతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఆగస్టు నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 20,180 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టు నెలలో నమోదైన 14,552 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 39 శాతం వార్షిక వృద్ధి. తక్కువ బడ్జెట్‌లో లభించే విశాలమైన క్యాబిన్, నమ్మకమైన పనితీరు వల్ల సాధారణ కుటుంబాలు దీనికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం రూ. 4.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభించే ఈ కారు మైలేజ్ విషయంలో లీడర్‌గా కొనసాగుతోంది.
అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి స్విఫ్ట్ 19,832 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 60 శాతం భారీ వృద్ధిని కనబరిచింది. మూడో స్థానంలో ఉన్న మారుతి ఫ్రాంక్స్ 51 శాతం వృద్ధితో 18,730 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగో స్థానంలో మారుతి ఎర్టిగా 18,516 యూనిట్లతో తన ఆధిపత్యాన్ని చాటగా, ఐదో స్థానంలో మారుతి డిజైర్ 18,418 యూనిట్లను సాధించి గట్టి పోటీ ఇచ్చింది. ఆరో స్థానంలో నిలిచిన బాలెనో 15,746 యూనిట్ల మైలురాయిని అందుకోగా, బ్రెజ్జా 15,288 యూనిట్లతో తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.
ఎనిమిదో స్థానంలో మారుతి విక్టోరిస్ 12,978 యూనిట్ల అమ్మకాలను సాధించింది. వాణిజ్య పరంగా ప్రజాదరణ పొందిన ఈకో వ్యూహత్మకంగా 11,961 యూనిట్లను విక్రయించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. పదియవ స్థానంలో ఉన్న ఆల్టో 57 శాతం వృద్ధితో 8,692 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మిగిలిన మోడళ్లలో గ్రాండ్ విటారా 7,808 యూనిట్లు, ఎక్స్‌ఎల్6 3,339 యూనిట్లు సేల్ అయ్యాయి. సెలెరియో ఏకంగా 99 శాతం పెరిగి 2,990 యూనిట్లకు చేరింది. కొత్తగా వచ్చిన ఈవిటారా 1,586 యూనిట్లు, జిమ్నీ 586 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇన్విక్టో 214 యూనిట్లు, ఎస్-ప్రెస్సో 107 యూనిట్ల విక్రయాలు సాధించాయి.
మారుతి వ్యాగన్ఆర్ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం దాని ఇంజిన్ ఆప్షన్లు, మైలేజ్. ఇందులో 1.0-లీటర్ (67బిహెచ్‌పి), 1.2-లీటర్ (90బిహెచ్‌పి) అని రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. 1.0-లీటర్ సీఎన్‌జీ మోడల్ కూడా ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.56 నుంచి 25.19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్‌జీ వర్షన్ ఏకంగా కేజీకి 34.05 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.




