Mercedes Benz S Class : జర్మనీ కారు.. ఇండియా పెట్రోల్.. లడఖ్ రోడ్లపై మెర్సిడెస్ రికార్డ్.!
Mercedes Benz S Class : భారతదేశంలో లభించే E20 పెట్రోల్ పై వాహనాల పనితీరు ఎలా ఉంటుందనే దానిపై చాలా మందిలో రకరకాల అంచనాలు ఉన్నాయి.
Mercedes-Benz-S-Class
Mercedes Benz S Class : భారతదేశంలో లభించే E20 పెట్రోల్ పై వాహనాల పనితీరు ఎలా ఉంటుందనే దానిపై చాలా మందిలో రకరకాల అంచనాలు ఉన్నాయి. అయితే, సరైన ఆక్టేన్ రేటింగ్ ఉంటే అత్యంత ప్రీమియం లగ్జరీ కార్లు కూడా ఇండియా E20 పెట్రోల్‌తో చాలా స్మూత్‌గా నడుస్తాయని మెర్సిడెస్ బెంజ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ 'S-క్లాస్' నిరూపించింది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న '140 ఇయర్స్, 140 ప్లేసెస్' డ్రైవ్‌లో భాగంగా, ఒక జర్మన్-స్పెసిఫికేషన్ మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ V8 కారును శ్రీనగర్ నుండి లేహ్ వరకు నడిపారు. భారతదేశంలోనే అత్యంత అందమైన, కఠినమైన ఈ పర్వత మార్గంలో HPCL సంస్థకు చెందిన 'Speed95' ప్రీమియం పెట్రోల్‌ను ఉపయోగించి ఈ జర్నీని విజయవంతంగా పూర్తి చేశారు.
ఢిఫరెంట్ లుక్.. పవర్‌ఫుల్ ఇంజన్
ఈ డ్రైవ్‌లో వాడిన మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ కారు చాలా ప్రత్యేకమైనది. ఇది సాధారణంగా ఇండియాలో ఉండే రైట్-హ్యాండ్ డ్రైవ్ కాకుండా, జర్మనీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా ఉన్న లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ కారు కావడం విశేషం. అంతేకాకుండా, మెర్సిడెస్ బెంజ్ 140 ఏళ్ల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ కారుపై ప్రత్యేకమైన '140 ఇయర్స్, 140 ప్లేసెస్' గ్రాఫిక్స్ డిజైన్‌ను వేశారు. ఇది శ్రీనగర్ నుండి లేహ్ వెళ్లే దారి పొడవునా పర్యాటకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ S-క్లాస్ కారులో 3,982cc V8 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 537bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి తోడు ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ద్వారా మరో 23bhp అదనపు బూస్ట్ లభిస్తుంది. 750Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేసే ఈ లగ్జరీ సెడాన్ కారు, కేవలం 4 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఇండియా E20 పెట్రోల్‌తో కొండల్లో ప్రయాణం
శ్రీనగర్ నుండి కార్గిల్ బయలుదేరే ముందు, లీటరుకు రూ.117.97 ధర ఉన్న HPCL Speed95 ప్రీమియం ఇంధనంతో కారు ట్యాంక్ నింపారు. ఈ ప్రీమియం ఇంధనంలో 15 నుండి 20 శాతం ఇథనాల్ (E20) ఉంటుంది , ఇది కనీసం 95 RON ఆక్టేన్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ V8 ఇంజన్ అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మెర్సిడెస్ బెంజ్ సంస్థ 98 RON పెట్రోల్‌ను సిఫార్సు చేస్తుంది, కానీ 95 RON అనేది ఈ కారుకు అవసరమైన కనీస ఇంధన ప్రమాణం. కార్గిల్ చేరుకున్న తర్వాత మళ్లీ ఇదే Speed95 పెట్రోల్‌ను రీఫిల్ చేసి లేహ్ వైపు ప్రయాణించారు. అంటే ఈ పూర్తి పర్వత ప్రయాణాన్ని భారతదేశపు E20 ప్రీమియం పెట్రోల్‌తోనే పూర్తి చేశారు.
‘ఇంస్టేటస్ అప్రూవ్డ్’ అన్న జర్మనీ ట్రిప్ లీడర్..
సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే లడఖ్ ప్రాంతం, నిటారైన కొండ రోడ్లు , కఠినమైన మలుపులు ఉన్నప్పటికీ, S-క్లాస్ కారు ఎక్కడా తన పవర్ తగ్గకుండా దూసుకెళ్లింది. ఓవర్‌టేక్ చేసే సమయంలో గానీ, కొండలు ఎక్కేటప్పుడు గానీ ఇంజన్ ఎక్కడా నాకింగ్ సౌండ్ రావడం వంటి సమస్యలు అస్సలు తలెత్తలేదు.
ఈ డ్రైవ్‌లో జర్మనీ నుండి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ అధికారిక ట్రిప్ లీడర్ కూడా పాల్గొన్నారు. లడఖ్‌లో ఈ కారును నడిపిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. "ఈ కారు పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతంగా ఉంది. మా సొంత దేశం జర్మనీలో నడిపిన దానికి, ఇక్కడ ఇండియా E20 పెట్రోల్‌తో నడిపిన దానికి నాకు ఎలాంటి తేడా అనిపించలేదు. కాబట్టి ఈ ఇంధనానికి మా ఇంజన్ అప్రూవల్ లభించినట్లే" అని సంతోషం వ్యక్తం చేశారు. దీనితో పాటు, గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే శ్రీనగర్, కార్గిల్ , లేహ్ మధ్య రోడ్డు మౌలిక సదుపాయాలు, హైవేలు భారీగా మెరుగుపడటం వల్లనే ఇంతటి లగ్జరీ కారు కూడా చాలా సులభంగా ప్రయాణించగలిగిందని ఈ జర్నీ నిరూపించింది.




