MG Starlight 560: భారత మార్కెట్లోకి ఎంజీ నుంచి సరికొత్త ఎస్యూవీ
MG Starlight 560: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మళ్ళీ సంచలనానికి రెడీ అవుతోంది. మెజస్టర్ లాంచ్ బాగా కలిసొచ్చిన తర్వాత, స్టార్‌లైట్ 560 పేరుతో కొత్త ఎస్యూవీ.
MG Starlight 560: భారత మార్కెట్లోకి ఎంజీ నుంచి సరికొత్త ఎస్యూవీ
MG Starlight 560: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మళ్ళీ ఒక సంచలనానికి రెడీ అవుతోంది. మెజస్టర్ లాంచ్ బాగా కలిసొచ్చిన తర్వాత, కంపెనీ ఇప్పుడు 'స్టార్‌లైట్ 560' పేరుతో కొత్త ఎస్యూవీని భారత్‌లోకి తీసుకొస్తోంది. ఈ కారు టెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో కార్ల అభిమానుల్లో మంచి హడావుడి మొదలైంది.
బాహ్య రూపం
హైవేపై టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ ఎస్యూవీ పూర్తిగా కప్పి పెట్టినప్పటికీ, దీని డిజైన్ వివరాలు బయటపడ్డాయి. దీన్ని '520' అని పిలుస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో అమ్ముతున్న 'వులింగ్ స్టార్‌లైట్ 560' తరహాలోనే ఇది కూడా ఉంటుంది. ముందు భాగంలో హనీకోంబ్ డిజైన్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, పగటిపూట వెలిగే డీఆర్ఎల్ లైట్లు, గాలి బాగా తగిలేలా డిజైన్ చేసిన బంపర్ ఉంటాయి. పైన రూఫ్ రెయిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, రెండు రంగుల అల్లాయ్ వీల్స్, పెద్ద విండోలు, వెనుక ఎల్ఈడీ టెయిల్ లైట్లతో ఈ కారు బాక్సీ లుక్‌లో చాలా బాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది.
సైజు … పోటీ
ఈ కారు 4,745 మి.మీ పొడవు, 1,850 మి.మీ వెడల్పు, 1,755–1,770 మి.మీ ఎత్తు , 2,810 మి.మీ వీల్‌బేస్‌తో వస్తోంది. సైజులో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ కంటే పెద్దదిగా ఉండి నేరుగా దానికే పోటీ ఇవ్వనుంది. అయితే మహీంద్రా మోడళ్లలో హైబ్రిడ్ టెక్నాలజీ లేకపోవడం ఈ ఎంజీ కారుకు మార్కెట్లో పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో 5 సీట్లు , 7 సీట్ల ఆప్షన్లలో దొరుకుతోంది.
లోపలి సదుపాయాలు … ఫీచర్లు
కారు లోపల చాలా మాడర్న్‌గా ఉంటుంది. 12.8 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ కొత్త లింగ్ ఓఎస్ పై పని చేస్తుంది. దానితో పాటు 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, రెండు స్పోక్స్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్ , లేటెస్ట్ అడాస్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఉంటాయి.
శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్
ఇక్కడే అసలు విశేషం ఉంది! ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ , 20.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిసి 197 బీహెచ్‌పీ పవర్, 230 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. సున్నా నుండి 100 కి.మీ చేరుకోవడానికి కేవలం 9.7 సెకన్లు మాత్రమే పడుతుంది. గరిష్ట వేగం గంటకు 170 కి.మీ. మైలేజీ , పెర్ఫార్మెన్స్ రెండూ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కారు.
పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వస్తోంది!
ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌తో పాటు, ఎంజీ దీని పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా భారత్‌కు తీసుకొస్తోంది. ఈ మోడల్ టెస్టింగ్ కూడా ఇప్పటికే దేశంలో మొదలైంది. ఎలక్ట్రిక్ వెర్షన్ ముందు భాగంలో మూసివేసిన గ్రిల్ తప్ప మిగిలిన డిజైన్ అంతా హైబ్రిడ్ కారులానే ఉంటుంది. 56.7 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ వరకు వెళ్తుందని చెప్తున్నారు. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్, విన్‌ఫాస్ట్ ఎంపీవీ 7 వంటి కార్లకు ఇది గట్టి టక్కర్ ఇవ్వనుంది.




