వామ్మో.. ఇది కార్ కాదు అంతకుమించి.. 1000కిమీల మైలేజీ.. జులై 16న MG హైబ్రిడ్ SUV లాంచ్..!
MG Starlight 560: సాధారణ కార్లకు భిన్నంగా, పర్యావరణ అనుకూల సాంకేతికతను ఇష్టపడే భారతీయ వినియోగదారుల కోసం MG మోటార్స్ ఈ సరికొత్త వ్యూహాన్ని రచించింది.
వామ్మో.. ఇది కార్ కాదు అంతకుమించి.. 1000కిమీల మైలేజీ.. జులై 16న MG హైబ్రిడ్ SUV లాంచ్..!
MG Starlight 560: భారతీయ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేవనుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్స్, తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మెజస్టర్' విజయవంతమైన లాంచ్ తర్వాత, భారత మార్కెట్లోకి మరో అద్భుతాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. సరికొత్త సాంకేతికతతో పర్యావరణహితంగా, మైలేజ్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు 'MG స్టార్‌లైట్ 560' ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ రూపంలో దూసుకొస్తోంది. జూలై 16, 2026న ఈ కారు భారత మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టే అవకాశం ఉంది.
భారతదేశంలో MG మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు..
సాధారణ కార్లకు భిన్నంగా, పర్యావరణ అనుకూల సాంకేతికతను ఇష్టపడే భారతీయ వినియోగదారుల కోసం MG మోటార్స్ ఈ సరికొత్త వ్యూహాన్ని రచించింది. MG స్టార్‌లైట్ 560 ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనం (PHEV). భారతదేశంలో MG సంస్థ నుంచి రాబోతున్న మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే భారతీయ రోడ్లపై ఈ కారు అనేకసార్లు పరీక్షల్లో కనిపించింది. అయితే, మన దేశీయ మార్కెట్లోకి వచ్చేసరికి దీనికి సరికొత్త పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. జేఎస్‌డబ్ల్యూ (JSW) భాగస్వామ్యంతో వస్తున్న ఈ కారుపై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆకట్టుకునే డిజైన్.. అదిరిపోయే లుక్స్..
లుక్స్, డిజైన్ పరంగా ఈ ఎస్‌యూవీ రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. ఇది బాక్సీ ఆకారంలో ఉంటూ, ఆధునిక ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, విడివిడిగా ఉండే డీఆర్‌ఎల్‌లు, మెరుస్తున్న నలుపు రంగు (గ్లాస్ బ్లాక్) భారీ ఫ్రంట్ గ్రిల్‌తో ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో లభించే ఊలింగ్ (Wuling) లోగో స్థానంలో, భారతదేశంలో జేఎస్‌డబ్ల్యూ MG బ్రాండింగ్‌తో ఈ కారు రానుంది. దీని పొడవు 4,745 మిమీ, వెడల్పు 1,850 మిమీ, వీల్ బేస్ 2,810 మిమీగా ఉంటుంది. టాటా సఫారీ, మహీంద్రా XUV 7XO వంటి దిగ్గజ కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
విలాసవంతమైన అంతర్గత వసతులు, ఫీచర్లు..
ఈ కారు లోపలి భాగం (క్యాబిన్) ఎంతో లగ్జరీగా, విశాలంగా ఉంటుంది. భారతదేశంలో దీనిని కేవలం 7-సీటర్ వేరియంట్‌గా మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రయాణికుల వినోదం, సౌకర్యం కోసం ఇందులో 12.8 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 8.8 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, లెదర్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అత్యంత సురక్షితమైన లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
పవర్ ఫుల్ ఇంజన్.. 1000 కిలోమీటర్ల మైలేజ్..
ఈ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇవి రెండూ కలిసి సంయుక్తంగా 197 bhp శక్తిని, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. కేవలం 10 సెకన్ల లోపే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ కారు గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సాంకేతికత కారణంగా, ఈ కారు పూర్తి ట్యాంక్, పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 1,000 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని అంచనా.
భారత మార్కెట్లో ఈ సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు విజయం సాధించాలంటే దీని ధర కీలక పాత్ర పోషించనుంది. అటు మైలేజ్, ఇటు లగ్జరీ ఫీచర్ల కలయికతో రాబోతున్న ఈ MG స్టార్‌లైట్ 560 ఖచ్చితంగా భారతీయ ఎస్‌యూవీ ప్రియులను అలరిస్తుందని చెప్పవచ్చు. దీనితో పాటు సంస్థ భవిష్యత్తులో దీని పూర్తి ఎలక్ట్రిక్ (EV) వెర్షన్‌ను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.




