EV Sales : భారత ఈవీ మార్కెట్లో ఎంజీ విండ్సర్ హవా.. టాటా పంచ్‌ను వెనక్కి నెట్టి మళ్లీ నంబర్-1 స్థానంలోకి!
EV Sales : భారత ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. జూన్ 2026 కార్ల అమ్మకాల గణాంకాల ప్రకారం టాటా పంచ్ ఈవీని వెనక్కి నెట్టి ఎంజీ విండ్సర్ ఈవీ మళ్లీ నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
MG Windsor EV
EV Sales : భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. జూన్ 2026 నెలవారీ రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. దేశీయ ఈవీ మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ పట్టు నిలుపుకుంది. గత మే నెలలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నంబర్-1 స్థానానికి చేరుకున్న టాటా పంచ్ ఈవీని విండ్సర్ కారు గట్టి పోటీ ఇచ్చి వెనక్కి నెట్టింది. ఈ సరికొత్త సేల్స్ లిస్ట్‌లో టాటా మోటార్స్, మహింద్రా కంపెనీల మోడల్స్ భారీగా ఉన్నప్పటికీ, అందరి కంటే ఎక్కువ అమ్మకాలతో ఎంజీ విండ్సర్ ఈవీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.
జూన్ నెల అమ్మకాల లెక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంజీ విండ్సర్ ఈవీ రికార్డు స్థాయిలో 4,157 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. మే నెలలో జరిగిన 3,829 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈ కారు ఏకంగా 9 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు రెండో స్థానంలో నిలిచిన టాటా పంచ్ ఈవీ జూన్ నెలలో 3,925 యూనిట్లు అమ్ముడుపోగా, మే నెలలో ఇవి 3,429 యూనిట్లుగా ఉన్నాయి. పంచ్ ఈవీ 14 శాతం వృద్ధిని సాధించినప్పటికీ విండ్సర్ కంటే కొన్ని యూనిట్లు వెనుకబడి రెండో స్థానానికే పరిమితం కావలసి వచ్చింది.
ఈ అమ్మకాల రేసులో మూడో స్థానంలో మహింద్రా ఎక్స్ఈవీ 9ఎస్ 3,746 యూనిట్ల విక్రయాలతో నిలిచింది. ఆ తర్వాత వరుసగా టాటా నెక్సాన్ ఈవీ 3,564 యూనిట్లు, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ 2,390 యూనిట్లు, టాటా హారియర్ ఈవీ 2,176 యూనిట్లతో టాప్-6 స్థానాలను భర్తీ చేశాయి. ఇక మారుతి సుజుకికి చెందిన ఈ-విటారా కారు 1,972 యూనిట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకోగా, మహీంద్రా బిఈ6 కారు 1,354 యూనిట్లు, టాటా కర్వ్ ఈవీ 1,264 యూనిట్లతో వరుస స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ టాప్-10 జాబితాలో టాటా టియాగో ఈవీ కారు మాత్రమే ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తూ 1,118 యూనిట్ల అమ్మకాలతో చివరి స్థానంలో నిలిచింది.
వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవడానికి కంపెనీ ఈ కారులో విండ్సర్ ఈవీ ప్రో అనే సరికొత్త వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్రో మోడల్లో 52.9kWh సామర్థ్యం కలిగిన ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. స్టాండర్డ్ విండ్సర్ కారులోని 38kWh బ్యాటరీ కేవలం 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే, ఈ సరికొత్త ప్రో మోడల్ ఏకంగా 449 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. బ్యాటరీ సామర్థ్యం పెరిగినప్పటికీ, ఈ కారు ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 136hp, 200Nm టార్క్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారు 7.4kWh ఏసీ ఛార్జర్‌తో వస్తుంది, ఇది బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 9.5 గంటల సమయం తీసుకుంటుంది. అదేవిధంగా 60kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 50 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ కారు బాహ్య డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఎంజీ హెక్టర్ ఎస్యూవీ తరహాలో ఉండే 18 అంగుళాల కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో అప్డేట్ చేశారు. అలాగే కస్టమర్లు తమకు నచ్చిన విధంగా సెలాడన్ బ్లూ, గ్లేజ్ రెడ్ మరియు అరోరా సిల్వర్ అనే మూడు కొత్త రంగులలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. కారు ఇంటీరియర్ పరంగా ఆల్-బ్లాక్ కలర్ స్కీమ్‌కు బదులుగా బ్యూటిఫుల్ బేజ్ కలర్ అపోల్స్టరీని అందించారు. ఈ కారులో అమర్చిన V2V (వెహికల్ టు వెహికల్), V2L (వెహికల్ టు లోడ్) టెక్నాలజీ ద్వారా మన కారు బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రిక్ కార్లను లేదా బయటి ఎలక్ట్రానిక్ పరికరాలను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. సేఫ్టీ కోసం ఇందులో లెవెల్ 2 అడాస్ సేఫ్టీ సూట్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించారు.




