SUV Cars: చిన్న కార్లు వద్దు..పెద్ద కార్లే కావాలి..మారుతున్న భారతీయుల మైండ్ సెట్
SUV Cars: ఒకప్పుడు రూల్ చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీలను పక్కనపెట్టి, ఎక్కువ స్పేస్, ప్రీమియం ఫీచర్లు ఉండే మిడ్ సైజ్ ఎస్‌యూవీలను కొనేందుకు కార్ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
creta
SUV Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు రూల్ చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీలను పక్కనపెట్టి, ఎక్కువ స్పేస్, ప్రీమియం ఫీచర్లు ఉండే మిడ్ సైజ్ ఎస్‌యూవీలను కొనేందుకు కార్ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోరిక ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్ల వాటా ఏకంగా 18.2 శాతానికి చేరింది. రెండేళ్ల కిందట ఇది కేవలం 12.4 శాతంగా మాత్రమే ఉండేది. గతేడాది 15 శాతంగా ఉన్న ఈ వాటా, ఇప్పుడు ఊహించని రీతిలో పెరిగింది. సబ్ 4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీల వాటా గతంలో ఉన్న 16.2 శాతం నుంచి 14.6 శాతానికి పడిపోయింది.
స్పేస్, కంఫర్ట్‌కే ఓటేస్తున్న కస్టమర్లు
మిడ్ సైజ్ ఎస్‌యూవీల వైపు జనాలు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం విస్తారమైన స్థలం, అతుల్నాత్మక ప్రయాణ అనుభవం. పెద్ద కుటుంబాలకు ఈ కార్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. వెనుక సీట్లలో ప్రయాణించే వారికి పుష్కలమైన లెగ్ రూమ్ దక్కడమే కాకుండా, ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి వీలుగా బూట్ స్పేస్ లభిస్తుంది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అలసట లేకుండా సుఖవంతమైన అనుభూతిని ఇస్తుండటంతో కొనుగోలుదారులు బడ్జెట్ కంటే కూడా సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రీమియమైజేషన్ ట్రెండ్.. పెరిగిన కొనుగోలు శక్తి
భారతీయ కార్ల మార్కెట్‌లో ప్రీమియమైజేషన్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు అయినా సరే, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లు, సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక వసతులు ఉన్న కార్లనే కస్టమర్లు ఎంచుకుంటున్నారు. ప్రజల ఆదాయాలు పెరగడం, కారును చాలా కాలం పాటు వాడుకోవాలనే ఆలోచన పెరగడం వల్ల కార్ల కొనుగోలు బడ్జెట్‌ను గణనీయంగా పెంచుతున్నారు.
కార్ల కంపెనీల కొత్త వ్యూహాలు
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆటోమొబైల్ దిగ్గజాలు కొత్త మిడ్ సైజ్ మోడళ్లను, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా వంటి పాపులర్ కార్లకు పోటీగా పండుగల సీజన్‌లో మరిన్ని కొత్త పెట్రోల్ మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ మోడళ్ల విక్రయాలు మందగించడంతో కంపెనీలన్నీ ఇప్పుడు మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. చిన్న కార్ల కాలం చెల్లి, పెద్ద కార్ల హవా ప్రారంభమైందని తాజా ట్రెండ్ స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగానికి మరింత డిమాండ్ పెరిగి, భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త మైలురాళ్లను క్రియేట్ చేసే అవకాశం ఉంది.




