బైక్‌లో కార్ లాంటి దిమ్మతిరిగే ఫీచర్లు.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాకే..!
Advanced Motorcycle Features: ఒకప్పుడు బైక్ అంటే ఇంజిన్, రెండు చక్రాలు, యాక్సిలరేటర్, బ్రేకులు.. ఇంతే.
బైక్‌లో కార్ లాంటి దిమ్మతిరిగే ఫీచర్లు.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాకే..!
Advanced Motorcycle Features: కారు కొనే బడ్జెట్ లేదా? డోంట్ వర్రీ.. ఇప్పుడు మీరు కొనే సాధారణ బైకుల్లోనే కార్ల స్థాయిలో లగ్జరీ ఫీచర్లు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు లక్షల రూపాయల కార్లకే పరిమితమైన టచ్ స్క్రీన్లు, రాడార్ సిస్టమ్స్, క్లైమేట్ కంట్రోల్ లాంటివి ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లోనూ దర్శనమిస్తున్నాయి. అసలు ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ సరికొత్త ట్రెండ్ ఏంటో చూద్దాం.
ఒకప్పుడు బైక్ అంటే ఇంజిన్, రెండు చక్రాలు, యాక్సిలరేటర్, బ్రేకులు.. ఇంతే. కాలానుగుణంగా టెక్నాలజీ పెరిగేకొద్దీ ద్విచక్ర వాహనాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. కుర్రకారు అభిరుచులకు తగినట్లుగా కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి దించుతున్నాయి. ఒకప్పుడు ఖరీదైన లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే ఫీచర్లను ఇప్పుడు సామాన్యులు వాడే కమ్యూటర్ బైకుల్లో సైతం సులభంగా చూస్తున్నాం. స్మార్ట్‌ఫోన్లతో పెరిగిన ప్రస్తుత తరం యువత అంచనాలను అందుకునేందుకు తయారీదారులు కార్ల స్థాయి టెక్నాలజీని బైకుల బడ్జెట్‌లోకి తీసుకొస్తున్నారు.
క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ స్క్రీన్లదే హవా..
హైవేపై కారులో వెళ్తున్నప్పుడు యాక్సిలరేటర్ తొక్కకుండానే ఒకే స్పీడ్‌తో వెళ్లే క్రూయిజ్ కంట్రోల్ సదుపాయం ఇప్పుడు బైకులకు కూడా వచ్చేసింది. కేవలం ప్రీమియం సెగ్మెంట్లోనే కాకుండా 500 సీసీ లోపు.. ఇంకా చెప్పాలంటే 125 సీసీ సాధారణ బైకుల్లోనూ ఈ ఫీచర్ ఇస్తున్నారు.
సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పాతకాలపు స్పీడోమీటర్ల స్థానంలో స్మార్ట్‌ఫోన్‌ను తలపించే కలర్ ఫుల్ టీఎఫ్‌టీ (TFT) స్క్రీన్లు వచ్చేశాయి. ఆపిల్ కార్‌ప్లే (Apple CarPlay), ఆండ్రాయిడ్ ఆటో (Android Auto) సపోర్ట్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ లాంటివి ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకుల్లో సాధారణంగా మారిపోయాయి.
కూల్ సీట్లు.. కీ-లెస్ ఇగ్నిషన్.. లగ్జరీకి కేరాఫ్..
లగ్జరీ కార్లకే పరిమితమైన కీ-లెస్ ఇగ్నిషన్ (తాళం లేకుండానే బైక్ స్టార్ట్ చేయడం) ఇప్పుడు మిడ్-లెవల్ రోడ్‌స్టర్స్‌లో సైతం సర్వసాధారణమైంది. ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ ద్వారా బటన్ నొక్కితే చాలు.. రోడ్డు గుంతలకు తగ్గట్లుగా షాకబ్జార్బర్లు వాటంతట అవే అడ్జస్ట్ అవుతాయి. వాతావరణానికి అనుగుణంగా వేడెక్కే, చల్లబడే సీట్లు కూడా రావడం మరో విశేషం. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 లాంటి దేశీ బైకుల్లో ఈ క్లైమేట్ కంట్రోల్ సీట్ల ఫీచర్ ఇప్పటికే కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది.
రాడార్ టెక్నాలజీతో ప్రాణాలకు రక్షణ కవచం..
బైక్ ప్రయాణంలో భద్రత ఎప్పుడూ పెద్ద సవాలే. దీనికి చెక్ పెట్టేందుకు అడ్వాన్స్‌డ్ రాడార్ ఆధారిత సేఫ్టీ సిస్టమ్స్ రంగంలోకి దిగాయి. అల్ట్రావయోలెట్ ఎక్స్47 క్రాసోవర్ లాంటి ఎలక్ట్రిక్ బైకుల్లో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటివి అందిస్తున్నారు. వెనక వైపు నుంచి వేగంగా వచ్చే వాహనాలను పసిగట్టి సైడ్ మిర్రర్లలో అలర్ట్ చేయడం దీని స్పెషాలిటీ. ముందున్న ట్రాఫిక్‌ను బట్టి వాటంతట అవే బ్రేకులు పడటం, దానంతట అదే వేగం తగ్గడం లాంటివి ఇప్పుడు స్మార్ట్ బైకులు చేస్తున్నాయి.
గాలిని చీల్చుకుంటూ స్వేచ్ఛగా బైక్ నడపడంలోని ఆ మజాను ఈ డిజిటల్ స్క్రీన్లు, డ్యాష్‌బోర్డ్ అలారాలు కాస్త తగ్గిస్తున్న మాట వాస్తవమే. టెక్నాలజీ పెరగడం వల్ల భద్రత మెరుగుపడి రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయన్నది కాదనలేని సత్యం. భవిష్యత్తులో ఈ రాడార్, ఏఐ ఆధారిత సేఫ్టీ ఫీచర్లు రైడర్ల ప్రాణాలను కాపాడటంలో గేమ్ ఛేంజర్‌గా మారడం ఖాయం.




