ఈ స్కూటర్ మీ దగ్గర ఉంటే రూట్ మిస్సయ్యే ఛాన్స్ లేదు.. బజాబ్ చేతక్ లో అదిరిపోయే ఫీచర్..!
Bajaj Chetak: బజాజ్ ఆటో సంస్థ తన పాత చేతక్ స్కూటర్‌ను మరింత అప్ డేట్ చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం ఈ స్కూటర్ లైన్-అప్‌ను ఇప్పుడు 'సీ సిరీస్' పేరుతో విడుదల చేసింది.
ఈ స్కూటర్ మీ దగ్గర ఉంటే రూట్ మిస్సయ్యే ఛాన్స్ లేదు.. బజాబ్ చేతక్ లో అదిరిపోయే ఫీచర్..!
New Bajaj Chetak Electric: మధ్యతరగతి ఆత్మీయ నేస్తం 'బజాజ్ చేతక్' ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు వచ్చింది. ఎలక్ట్రిక్ అవతారంలో ఇప్పటికే అలరిస్తున్న ఈ ఐకానిక్ స్కూటర్, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ సపోర్ట్, మెరుగైన వేగంతో మార్కెట్లోకి విడుదలైంది. అధునాతన సాంకేతికతను జోడించి, సామాన్యుడి బడ్జెట్‌కు తగ్గట్లుగా దీనిని రూపొందించడం విశేషం.
పాత జ్ఞాపకం.. కొత్త సాంకేతికత..
బజాజ్ ఆటో సంస్థ తన పాత చేతక్ స్కూటర్‌ను మరింత ఆధునికీకరించి 2026 ఎడిషన్‌ను విడుదల చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం ఈ స్కూటర్ లైన్-అప్‌ను ఇప్పుడు 'సీ సిరీస్' (C Series) పేరుతో సి 25, సీ30, సీ35 అని మూడు విభాగాలుగా విడుదల చేసింది. కేవలం పేరు మార్చడమే కాకుండా, వాహన పనితీరులో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా టాప్ ఎండ్ మోడల్ అయిన సీ35లో మోటార్ సామర్థ్యాన్ని 4.8 కిలోవాట్లకు పెంచారు. దీనివల్ల ప్రయాణం మరింత వేగవంతంగా, సాఫీగా సాగుతుంది.
ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ దిశానిర్దేశం..
ఈ కొత్త చేతక్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'గూగుల్ మ్యాప్స్' ఇంటెగ్రేషన్. స్కూటర్ డిస్‌ప్లేపైనే మ్యాప్స్ కనిపించడం వల్ల వాహనదారులు అడ్రస్ కోసం మాటిమాటికీ జేబులోంచి ఫోన్ తీయాల్సిన అవసరం ఉండదు. చేతక్ యాప్ ద్వారా దీనిని అనుసంధానించుకోవచ్చు. పాత మ్యాపింగ్ విధానం కంటే ఇది ఎంతో వేగంగా, కచ్చితంగా పని చేస్తుందని సంస్థ వెల్లడించింది. దీనితో పాటు ఓవర్-ది-ఎయర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సౌకర్యాన్ని కూడా మెరుగుపరిచారు.
మెరుగైన వేగం, ఫాస్ట్ ఛార్జింగ్..
సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వేగం తక్కువగా ఉంటుందనే ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని, అన్ని వేరియంట్ల టాప్ స్పీడ్‌ను పెంచారు. సీ35 మోడల్ ఇప్పుడు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అలాగే ఛార్జింగ్ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. సీ30 మోడల్ కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుంటుంది. అంటే గతంతో పోలిస్తే ఒక గంట సమయం ఆదా అవుతుంది. హిల్-హోల్డ్ అసిస్ట్, స్పోర్ట్ రైడ్ మోడ్ వంటి ప్రీమియం ఫీచర్లను ఇప్పుడు అదనపు ఖర్చు లేకుండానే ప్రామాణికంగా అందిస్తున్నారు.
ధర..
ఇన్ని అదనపు ఫీచర్లు జోడించినప్పటికీ, బజాజ్ సంస్థ ధరలను పెంచకుండా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బేస్ మోడల్ సీ25 ధర 89,500 రూపాయలుగా ఉండగా, అత్యధికంగా 153 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే సి 35 మోడల్ ధర 1.34 లక్షల రూపాయలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. మెటల్ బాడీ, క్లాసిక్ లుక్, ఆధునిక టెక్నాలజీ కలబోసిన కొత్త చేతక్, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోనుంది.




