25 ఏళ్ల తర్వాత పల్సర్‌కు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త 150, 125 వచ్చేశాయ్!

బజాజ్ కొత్త పల్సర్ 150, 125 బైక్‌లను విడుదల చేసింది. కొత్త ఇంజిన్, TFT డిస్‌ప్లే, రైడ్ మోడ్‌లు, గూగుల్ మ్యాప్స్‌తో వచ్చాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Aug 2026 12:40 AM IST
New Bajaj Pulsar 150, 125 Launched
X

New Bajaj Pulsar 150, 125 Launched

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అత్యంత గుర్తింపు పొందిన పల్సర్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో కొత్త పల్సర్ 150, పల్సర్ 125 మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్త ఇంజిన్, గేర్‌బాక్స్, మోనోషాక్ సస్పెన్షన్, 5 అంగుళాల TFT కన్సోల్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సహా పలు కొత్త ఫీచర్లను ఇందులో అందించింది.

2001లో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన పల్సర్.. 25 ఏళ్లలో భారతీయ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటివరకు 40కి పైగా దేశాల్లో 2 కోట్లకు పైగా పల్సర్ బైక్‌లు విక్రయమైనట్లు కంపెనీ తెలిపింది.

కొత్త పల్సర్ 150, 125 ఇంజిన్ వివరాలు

కొత్త పల్సర్ 150లో 149.5 సీసీ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,500 ఆర్‌పీఎమ్ వద్ద 14 పీఎస్ పవర్, 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 13.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

పల్సర్ 125లో 124.58 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 11 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. కొత్త గేర్‌బాక్స్‌తో తక్కువ గేర్లలో ట్రాక్షన్ మెరుగుపడేలా బజాజ్ మార్పులు చేసింది.

మోనోషాక్ సస్పెన్షన్

కొత్త పల్సర్ 150, పల్సర్ 125లో నైట్రోజన్ గ్యాస్ ఛార్జ్డ్ ఎమల్షన్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. కొత్త డైమండ్ టైప్ ఫ్రేమ్ కారణంగా బైక్ హ్యాండ్లింగ్, స్టెబిలిటీ మెరుగుపడుతుందని కంపెనీ తెలిపింది.

5 అంగుళాల TFT డిస్‌ప్లే

కొత్త పల్సర్ మోడళ్లలో 5 అంగుళాల TFT కన్సోల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఫోన్ కాల్స్, మెసేజ్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ఇందులో స్టోర్ చేసుకునే సదుపాయం ఉంది.

మూడు రైడ్ మోడ్‌లు

పల్సర్‌లో తొలిసారిగా రోడ్, రెయిన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లను అందించారు. ట్రాఫిక్‌లో తక్కువ వేగంతో బైక్ నడిపేటప్పుడు మెరుగైన కంట్రోల్ కోసం క్రాల్ టెక్ ఫీచర్‌ను కూడా జోడించారు.

రీడిజైన్ చేసిన వుల్ఫ్-ఐ హెడ్‌ల్యాంప్‌తో కొత్త పల్సర్‌కు మరింత షార్ప్ లుక్ వచ్చింది. టాప్ వేరియంట్లలో ఐఎస్‌జీ టెక్నాలజీని కూడా అందించారు. ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ ద్వారా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచే ప్రయత్నం చేశారు.

కొత్త పల్సర్ 150, 125 ధరలు

కొత్త బజాజ్ పల్సర్ 150 ప్రారంభ ధర రూ.1,15,233గా ఉంది. పల్సర్ 125 ధర రూ.92,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు.

25 ఏళ్లుగా పల్సర్‌కు ఉన్న స్పోర్టీ డిజైన్, పెర్ఫార్మెన్స్, రైడింగ్ థ్రిల్‌ను కొనసాగిస్తూనే కొత్త టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లు, సస్పెన్షన్, రైడ్ మోడ్‌లను జోడించడం ద్వారా కొత్త తరం రైడర్లను ఆకట్టుకోవాలని బజాజ్ భావిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story