New Car Launches : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు: జూలైలో రోడ్లపైకి రానున్న 5 సెన్సేషన్ కార్లు
New Car Launches : కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? జూలై 2026లో మార్కెట్‌ను ఊపేయడానికి రెనో, నిస్సాన్, టయోటా వంటి దిగ్గజ కంపెనీల నుంచి 5 అదిరిపోయే కార్లు లాంచ్ అవుతున్నాయి.
Nissan Tekton SUV
New Car Launches : భారతీయ ఆటోమొబైల్ రంగానికి జూలై 2026 నెల అత్యంత కీలకంగా మారబోతోంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ ప్రారంభం కావడంతో పాటు, త్వరలోనే పండుగ సీజన్ కూడా రాబోతుండటంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు లైన్ కట్టాయి. ఈ జూలై నెలలో రెనో, నిస్సాన్, టయోటా, స్కోడా, ఎంజీ వంటి దిగ్గజ బ్రాండ్ల నుంచి పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో సరికొత్త ఎస్‌యూవీలు, ఫేస్‌లిఫ్ట్ కార్లు విడుదల కానున్నాయి. కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ నెలలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
1. రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్
జూలై నెలలో అందరికంటే ముందుగా జూలై 3వ తేదీన రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. మధ్యతరగతి వారికి ఎంతగానో నచ్చిన ఈ బడ్జెట్ కారులో ఎక్స్టీరియర్ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్ల పరంగా కొన్ని క్రేజీ అప్డేట్స్ చేశారు. అయితే దీని ఇంజన్లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో మునుపటి లాగే 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 67 bhp పవర్‌ను, 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లు లభించనున్నాయి.
2. నిస్సాన్ టెక్టాన్
ఆ తర్వాత జూలై 9వ తేదీన నిస్సాన్ కంపెనీ నుంచి టెక్టాన్ అనే సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ కానుంది. నిస్సాన్ బ్రాండ్‌కు ఈ మోడల్ అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. ఈ కారును మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో తీసుకువస్తున్నట్లు సమాచారం. మొదటిది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, రెండోది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా.. మూడోది 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ హైబ్రిడ్ వేరియంట్ లాంచింగ్ సమయంలో గానీ లేదా అక్టోబర్ నెలలో గానీ అందుబాటులోకి రావచ్చు.
3. ఎంజీ కొత్త ఎస్యూవీ
జూలై 16వ తేదీన బ్రిటిష్ కార్ల బ్రాండ్ ఎంజీ ఒక సరికొత్త పవర్ఫుల్ ఎస్‌యూవీని భారత్‌లో పరిచయం చేయనుంది. గ్లోబల్ మార్కెట్లోని వూలింగ్ స్టార్‌లైట్ 560 (Wuling Starlight 560) ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కారును ఇండియాలో సరికొత్త పేరుతో లాంచ్ చేయనున్నారు. ఇది రెండు ఆప్షన్లలో రానుంది. మొదటిది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 194 bhp పవర్‌ను ఇస్తుంది. రెండోది కంప్లీట్ ఎలక్ట్రిక్ వేరియంట్, దీనిలో 56.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 134 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది.
4. టయోటా హిలక్స్
నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ అయిన టయోటా కంపెనీ నుండి జూలై 28న సరికొత్త హిలక్స్ పిక్అప్ ట్రక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సరికొత్త బోల్డ్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్‌తో వస్తున్న ఈ కారులో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. దీనికి అదనంగా 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఈ ఇంజన్ ఏకంగా 201 bhp పవర్‌ను, 500 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి. భవిష్యత్తులో దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ఇండియాలో తెచ్చేందుకు టయోటా ప్లాన్ చేస్తోంది.
5. స్కోడా కొడియాక్ ఆర్ఎస్
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇష్టపడే వారి కోసం స్కోడా కంపెనీ కొడియాక్ ఆర్ఎస్ ఎస్‌యూవీని జూలైలో తీసుకువస్తోంది. దీని లాంచ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు కానీ, దీని క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఇందులో 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 262 bhp పవర్‌ను, 400 Nm టార్క్‌ను ఇస్తుంది. 7-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ దీని సొంతం. ఈ కారుకున్న క్రేజ్ ఎలాంటిదంటే.. ఇండియా కోసం కేటాయించిన మొదటి 50 యూనిట్ల బుకింగ్స్ కేవలం 6 నిమిషాల్లోనే క్లోజ్ అయిపోయాయి.




