రూ.5-6 లక్షల బడ్జెట్.. కొత్త కారు బెస్ట్ ఆప్షనా? సెకండ్ హ్యాండ్ మేలా?
New Car vs Old Car: రూ.5-6 లక్షల బడ్జెట్‌లో కొత్త కారు కొనడం మంచిదా లేక పాత కారు బెటరా? 5 ఏళ్ల EMI, మెయింటెనెన్స్, రీసేల్ వివరాలు ఓసారి చూద్దాం.
రూ.5-6 లక్షల బడ్జెట్.. కొత్త కారు బెస్ట్ ఆప్షనా? సెకండ్ హ్యాండ్ మేలా?
New Car vs Old Car: మధ్యతరగతి వాహన కొనుగోలుదారుల్లో రూ.5-6 లక్షల బడ్జెట్ ఎప్పుడూ పెద్ద సవాలే. షోరూమ్ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్ కారు తీసుకోవాలా లేక అదే ధరకు మార్కెట్లో లభించే పాత ప్రీమియం కారును ఎంచుకోవాలా అనే సందిగ్ధత అందరిలోనూ ఉంటుంది. ఐదేళ్ల ఖర్చుల పూర్తి లెక్కలు తెలిస్తే సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సులువు.
కొనుగోలు ధర ఒకటే.. ఐదేళ్ల ఖర్చులే అసలు లెక్క..!
రూ.5.5 లక్షల ఆన్-రోడ్ ధరతో కొత్త ఆల్టో కే10 లేదా క్విడ్ వంటి కారును తీసుకున్నా, అంతే మొత్తానికి నాలుగేళ్ల క్రితం నాటి సెకండ్ హ్యాండ్ బాలెనో లేదా బ్రెజా వంటి మోడల్‌ను ఎంచుకున్నా ప్రారంభ ధర సమానంగానే కనిపిస్తుంది. అయితే అసలు భారం ఐదేళ్ల నిర్వహణలోనే మొదలవుతుంది. కొత్త కారుపై బ్యాంకులు 8.5% నుంచి 9% వడ్డీకే రూ.4 లక్షల రుణం అందిస్తుండగా, పాత కార్లకు ఇది 12% నుంచి 14% వరకు చేరుతుంది. ఫలితంగా వడ్డీ రూపంలోనే పాత కారుకు రూ.1.40 లక్షలు చెల్లించాల్సి వస్తుంది, కొత్త కారుకైతే అది కేవలం రూ.95,000 మాత్రమే అవుతుంది.
మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ వ్యయాల్లో భారీ తేడా..
నిర్వహణ ఖర్చుల విషయానికి వస్తే కొత్త వాహనానికి ఐదేళ్లలో సర్వీసింగ్ నిమిత్తం సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చవుతుంది. పాత కారులో టైర్లు, సస్పెన్షన్, క్లచ్ వంటి విడిభాగాల మరమ్మతులకు ఏకంగా రూ.70,000 నుంచి రూ.90,000 వరకు ఖర్చవుతుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం కొత్త వాహనానికి రూ.65,000 వరకు ఉంటే, పాతదానికి దాదాపు రూ.45,000 అవుతుంది.
రీసేల్ వ్యాల్యూ, ఐదేళ్ల మొత్తం ఖర్చు..
ఐదేళ్ల తర్వాత కొత్త కారు రీసేల్ విలువ 45 శాతం క్షీణించి రూ.3 లక్షలు పలికే అవకాశం ఉంది. పాత ప్రీమియం కారు దాదాపు 40 శాతం తరుగుదలతో రూ.3.30 లక్షలు రాబట్టవచ్చు. అన్ని ఖర్చులు కలిపితే కొత్త కారు యాజమాన్య వ్యయం రూ.4.35 లక్షలు కాగా, పాత కారు మొత్తం నిర్వహణ వ్యయం రూ.5.15 లక్షలకు చేరుకుంటుంది. అంటే కొత్త కారు సుమారు రూ.80,000 ఆదా చేస్తుంది.
మొదటిసారి వాహనం కొనేవారికి, రోజువారీ అధిక మైలేజీ (22-24 కి.మీ/లీ) కోరుకునేవారికి కొత్త కారు కొనుగోలే సురక్షితమైన మార్గం. లగ్జరీ ఫీచర్లు, విశాలమైన స్పేస్ కావాలనుకునేవారు అదనపు రిపేర్ రిస్క్‌లకు సిద్ధపడితేనే సెకండ్ హ్యాండ్ వైపు చూడటం మంచిది.




