Citroen ec3x : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల జర్నీ.. భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్
Citroen ec3x : సిట్రోయెన్ eC3X ఎలక్ట్రిక్ కార్ బాస్ మోడల్ కింద రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది 320 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది.
Citroen ec3x
Citroen ec3x : భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని మరింత సులభతరం చేస్తూ ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ సరికొత్త సిట్రోయెన్ eC3X ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ కారును సరికొత్త హంగులతో డిజైన్ చేశారు. కారు కొనుగోలును మరింత సులభతరం చేయడానికి కంపెనీ దీనిని వినూత్నమైన బ్యాటరీ ప్లాన్‌తో రంగంలోకి దించింది. ఈ సరికొత్త కారు బుకింగ్స్ ఇప్పటికే దేశంలోని అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో, కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి.
బాస్ మోడల్ అంటే ఏంటి?
ఈ కారును కంపెనీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్ కింద కేవలం రూ.6.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కారు కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కోసం పూర్తి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా కారును నడిపే ప్రతి కిలోమీటరుకు రూ.2.26 చొప్పున బ్యాటరీ అద్దెగా చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ కస్టమర్లకు ఈ బ్యాటరీ అద్దె స్కీమ్ వద్దు అనుకుంటే.. బ్యాటరీతో కలిపి ఈ కారును పూర్తి ధర రూ.10.25 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ల బడ్జెట్ మేనేజ్‌మెంట్‌కు వీలుగా కంపెనీ డ్యూయల్-లోన్ ఫైనాన్స్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది.
ఆకట్టుకునే సరికొత్త డిజైన్, కలర్ ఆప్షన్లు
కొత్త మోడల్ సిట్రోయెన్ eC3X కార్ డిజైన్‌లో కంపెనీ పలు ఆకర్షణీయమైన మార్పులు చేసింది. ఇందులో స్ప్లిట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, సరికొత్త ఫాగ్ ల్యాంప్స్, కాంట్రాస్ట్ కలర్ స్కిడ్ ప్లేట్లు, 15-ఇంచుల డైమండ్-కట్ అలాయ్ వీల్స్ అమర్చారు. ఈ మోడల్ మొత్తం 6 మోనోటోన్ కలర్స్ (పోలార్ వైట్, కాస్మో బ్లూ, స్టీల్ గ్రే, గార్నెట్ రెడ్, పెర్లా నెరా బ్లాక్, డీప్ ఫారెస్ట్ గ్రీన్)లలో లభిస్తుంది. అలాగే లోపల మూడు రకాల కేబిన్ థీమ్స్, లెదరెట్ సీట్ల ఆప్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు.
నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, టాప్ క్లాస్ సేఫ్టీ
కారు లోపలి భాగంలో కస్టమర్లకు లగ్జరీ ఫీలింగ్ కలిగించేలా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచుల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, అప్‌డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని ఇందులో జోడించారు. కస్టమర్ల సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ కారులో బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. అదనపు ఫీచర్ల కింద జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్, డ్యూయల్ డాష్‌క్యామ్‌లను కూడా ఎంచుకునే వీలుంది.
బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్
ఈ కారు పవర్‌ట్రెయిన్, పర్ఫార్మెన్స్ పాత మోడల్ తరహాలోనే నమ్మకంగా ఉంది. ఇందులో 29.2kWh సామర్థ్యం కలిగిన శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 56bhp పవర్‌ను, 143Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. అంతేకాదు ఇందులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల కేవలం 57 నిమిషాల్లోనే కారు బ్యాటరీ 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ అయిపోతుంది.




