Maruti Wagon R: ఈ సారి మైలేజ్ మామూలుగా ఉండదు.. కొత్త అవతారంలో త్వరలో మార్కెట్లోకి వ్యాగన్‌ఆర్

Maruti Wagon R: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని కార్లలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఒకటి.

CR Reddy
Published on: 16 Sept 2026 11:06 AM IST
Maruti Wagon R
X

Maruti Wagon R

Maruti Wagon R: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని కార్లలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఒకటి. 1999లో మన దేశంలో అడుగుపెట్టిన ఈ ఫ్యామిలీ కార్, కాలానికి తగినట్లుగా ఎన్నో మార్పులు సంతరించుకుంది. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న మూడో జనరేషన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2022 ఫిబ్రవరిలో విడుదలై భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాపులర్ కార్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు సంబంధించి టెస్టింగ్ ప్రక్రియ మొదలైంది. రోడ్డుపై పూర్తిగా కవర్ చేసిన టెస్ట్ వెర్షన్ కనిపిస్తుండటంతో, త్వరలోనే ఈ అప్‌డేటెడ్ మోడల్ మార్కెట్లోకి రానుందని స్పష్టమవుతోంది.

టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కొత్త కారు డిజైన్ ప్రకారం.. దీనిలో కొన్ని సరికొత్త కాస్మెటిక్ మార్పులు చేశారు. ముందు భాగంలో కొత్త డిజైన్‌తో కూడిన హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, మార్పులు చేసిన గ్రిల్, స్మూత్ ఫినిషింగ్ బంపర్, కింద కొత్తగా డిజైన్ చేసిన ఎయిర్ ఇన్‌లెట్స్‌ను అమర్చారు. అలాగే వెనుక వైపు బంపర్‌లో చిన్నపాటి మార్పులు చేసి, హారిజాంటల్ రిఫ్లెక్టర్ల బదులుగా వర్టికల్ రిఫ్లెక్టర్లను ఇచ్చారు. అయితే టెయిల్ ల్యాంప్స్ డిజైన్ మాత్రం పాత మోడల్ మాదిరిగానే ఉంచారు. ఇంటీరియర్ పరంగా కూడా పెద్దగా మార్పులు లేనప్పటికీ, చూడటానికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

మైలేజ్ పెంచే కొత్త జె-సిరీస్ ఇంజిన్

ఈ కొత్త వ్యాగన్‌ఆర్ ఇంజిన్ విషయంలో కంపెనీ పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. బేస్, మిడ్-స్పెక్ వేరియంట్లలో యథావిధిగా 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లను కొనసాగించనున్నారు. అయితే టాప్-ఎండ్ వెర్షన్లలో ఇప్పటివరకు ఉన్న 1.2 లీటర్ ఇంజిన్‌కు బదులుగా, సరికొత్త 3-సిలిండర్ జె-సిరీస్ (Z12E) ఇంజిన్‌ను అందించే సూచనలున్నాయి. ఇప్పటికే మారుతి తన ప్రముఖ కార్లయిన స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్లలో ఈ కొత్త ఇంజిన్‌ల ద్వారా మైలేజీని గణనీయంగా పెంచింది. అదే ఫార్ములాను ఇప్పుడు వ్యాగన్‌ఆర్‌లోనూ అమలు చేయనున్నారు.

ధర, మార్కెట్ పోటీ వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాగన్‌ఆర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.7.24 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలయ్యాక ధరల్లో స్వల్పంగా పెరుగుదల ఉండే అవకాశం ఉంది. సాధారణ కుటుంబాలకు అత్యంత ఆప్షన్‌గా నిలిచే ఈ కారుకు మార్కెట్లో హ్యుందాయ్ ఐ10, టాటా టియాగో కార్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. కొత్త ఇంజిన్, అద్భుతమైన మైలేజ్‌తో వస్తున్న ఈ కొత్త వ్యాగన్‌ఆర్ వాహన ప్రియులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.