Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ డిజైన్ లీక్.. డిసెంబర్ 1న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఎస్యూవీ
Toyota Fortuner: టయోటా కంపెనీ పాపులర్ ఎస్యూవీ తదుపరి తరానికి చెందిన కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
Toyota Fortuner
Toyota Fortuner: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ అంటే ఒక రేంజ్ క్రేజ్ ఉంది. ఇప్పుడు కంపెనీ ఈ పాపులర్ ఎస్యూవీ తదుపరి తరానికి చెందిన కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రెడ్డిట్ వేదికగా ఈ కొత్త కారుకు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ చిత్రాల ఆధారంగా కొత్త ఫార్చ్యూనర్ డిజైన్ ప్రస్తుత మోడల్ కన్నా పూర్తిగా భిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. దీని ముందు భాగం కొత్త టయోటా హీలక్స్ డిజైన్‌ను పోలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెద్ద జాలిగ్రిల్, సన్నని ఎల్ఈడీ హెడ్లైట్లు, మందపాటి బంపర్‌తో ఈ ఎస్యూవీ రోడ్డుపై మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.
సైడ్, రియర్ ప్రొఫైల్ మార్పులు
ఈ అప్డేటెడ్ ఎస్యూవీ సైడ్ డిజైన్ పాత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, బాడీ లైన్స్ అలాగే విండోల రూపకల్పనలో కొన్ని మార్పులు చేశారు. దీని రూఫ్ రైల్స్, ఓఆర్‌విఎమ్స్, అలాగే బి, సి, డి పీలర్లు నలుపు రంగులో తీర్చిదిద్దడం వల్ల కారు మరింత స్పోర్టీ లుక్‌ను సంతరించుకుంది. వెనుక వైపు డిజైన్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. సరికొత్త కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, పెద్ద సైజు స్పాయిలర్, విశాలమైన విండ్‌స్క్రీన్ ఈ కారు వెనుక అందాన్ని మరింత పెంచుతున్నాయి.
అడ్వాన్సుడ్ ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్
బయట లుక్ మాత్రమే కాకుండా లోపలి క్యాబిన్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇందులో 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వనున్నారు. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన సదుపాయాలు ఇందులో లభించే అవకాశం ఉంది. దీనివల్ల కస్టమర్ల నుంచి గతంలో ఉన్న చిన్నపాటి ఫిర్యాదులు కూడా తొలగిపోతాయి.
ఇంజిన్ కెపాసిటీ, లాంచ్ వివరాలు
ఈ నూతన వాహనాన్ని అప్డేట్ చేసిన ఐఎమ్‌వి ప్లాట్‌ఫారమ్‌పై సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇందులో ప్రస్తుత మోడల్లో ఉన్న 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 2.8 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది. మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు పవర్ ఫుల్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభించనుంది. టయోటా సంస్థ ఈ ప్రతిష్టాత్మక ఎస్‌యూవీని డిసెంబర్ 1, 2026 న ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది. త్వరలోనే ఇది భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.




