Hyundai Creta : ఈ మూడు అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ కింగ్‌గా మారనున్న నెక్స్ట్ జెన్ హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta : భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా కొత్త జనరేషన్ మోడల్ సరికొత్త అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోంది.
Next-Gen Hyundai Creta
Hyundai Creta : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రెటా కారుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు దీని నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త క్రెటా కేవలం కొత్త ప్లాట్‌ఫారమ్, కొత్త పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత అడ్వాన్స్డ్ ఫీచర్లతో రాబోతోంది. ఈ కార్ లవర్స్ కోసం కొత్త జనరేషన్ క్రెటాలో రాబోతున్న మూడు ప్రధాన ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి.
మరింత సేఫ్టీ ఇచ్చే లెవల్ 2+ ADAS సిస్టమ్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రెటా మోడల్‌లో లెవల్-2 ఏడిఏఎస్ టెక్నాలజీ కింద 20 సేఫ్టీ ఫీచర్లు లభిస్తున్నాయి. అయితే కొత్త జనరేషన్ క్రెటాలో అంతకంటే అడ్వాన్సుడ్ Level 2+ ADAS సిస్టమ్‌ను అందించేందుకు హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. ఇందులో ఏకంగా 28 డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, ఫ్రంటల్ కొలిజన్ వార్నింగ్, జంక్షన్ క్రాసింగ్ అసిస్ట్ వంటి అనేక మోడరన్ ఫీచర్లు ఈ అప్‌గ్రేడ్‌లో రానున్నాయి. దీనివల్ల లాంగ్ డ్రైవ్‌లలో భద్రత మరింత పెరగడమే కాకుండా డ్రైవింగ్ అనుభవం చాలా తేలికగా మారనుంది.
15 అంగుళాల కంటే పెద్దదిగా PLEOS ఇన్‌ఫోటైన్‌మెంట్
కొత్త క్రెటా కేబిన్ లోపల ప్రధాన ఆకర్షణగా దాని ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నిలవనుంది. కంపెనీ తన అంతర్జాతీయ మోడళ్లలో ఉపయోగిస్తున్న PLEOS ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇండియా మోడల్‌లోనూ ప్రవేశపెట్టబోతోంది. ఇందుకోసం 15 అంగుళాల కంటే పెద్దదైన భారీ టచ్‌స్క్రీన్‌ను అమర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సిస్టమ్ ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను సపోర్ట్ చేస్తుంది. విశేషమేమిటంటే ఈ ఓటీఏ అప్‌డేట్లు కేవలం సాఫ్ట్‌వేర్‌కే పరిమితం కాకుండా, సస్పెన్షన్ వంటి మెకానికల్ సెట్టింగ్స్‌ను కూడా అప్‌డేట్ చేసే వెసులుబాటును ఇస్తాయి. దీనితో పాటు సన్నటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో లభించనుంది.
HUD, వైర్‌లెస్ కనెక్టివిటీ రగడకు చెక్
ప్రస్తుత క్రెటా టాప్ వేరియంట్‌లో కూడా హెడ్-అప్ డిస్‌ప్లే, ఇన్-బిల్ట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లు లేవనే అసంతృప్తి కస్టమర్లలో ఉంది. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం అడాప్టర్లు వాడాల్సి వస్తోంది. అయితే నెక్స్ట్ జనరేషన్ మోడల్‌లో ఈ లోపాన్ని పూర్తిగా సరిదిద్దనున్నారు. కొత్త క్రెటాలో గ్లాస్ పై డ్రైవింగ్ సమాచారాన్ని చూపే HUD సిస్టమ్‌తో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని అన్ని ప్రధాన వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా అందించేందుకు హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది.




