Hyundai Creta: క్రెటా క్రేజ్ మామూలుగా ఉండదు..నయా లుక్‌తో రోడ్లపైకి వస్తున్న కొత్త ఎస్యూవీ
Hyundai Creta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతోంది.
Hyundai Creta
Hyundai Creta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతోంది. కంపెనీ ప్రస్తుతం ఈ పాపులర్ ఎస్‌యూవీకి సంబంధించి థర్డ్ జనరేషన్ మోడల్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. భారత్ అలాగే సౌత్ కొరియా దేశాల్లో ఈ కొత్త మోడల్ టెస్టింగ్ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా గుర్గావ్ ప్రాంతం సమీపంలో ఈ నయా ఎస్యూవీ టెస్ట్ రన్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కింది. ముఖ్యంగా ఈసారి కారుకు సంబంధించిన లోవర్ ట్రిమ్ వేరియంట్ రోడ్డుపై కనిపించడం ఆటో మొబైల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పెరగనున్న సైజ్, ఆకర్షణీయమైన డిజైన్ మార్పులు
టెస్టింగ్ సమయంలో కనిపించిన మోడల్లో 16 అంగుళాల స్టీల్ వీల్స్ అమర్చి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి కంపెనీ బేస్ లేదా లోవర్ వేరియంట్లలో ఈ వీల్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక మిడ్ వేరియంట్లలో 17 ఇంచులు, టాప్ ఎండ్ మోడళ్లలో 18 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం కొత్త క్రెటా పొడవు సుమారు 100 మిమీ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. దీని మొత్తం పొడవు దాదాపు 4.5 మీటర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో గత మోడల్ కంటే ఈ కొత్త ఎస్యూవీ మరింత పెద్దదిగా, రగ్డ్ లుక్‌తో రోడ్డుపై కనిపించనుంది.
అత్యాధునిక హంగులతో సరికొత్త ఇంటీరియర్ డిజైన్
కేవలం బాహ్య రూపమే కాకుండా లోపలి క్యాబిన్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చాలని హ్యుందాయ్ ప్రణాళిక వేసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని హ్యుందాయ్ గ్రాండియర్, టక్సాన్ మోడళ్ల లేఅవుట్ ఆధారంగా దీని ఇంటీరియర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నయా కారులో 9.9 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇవ్వనున్నారు. అలాగే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం 12.9 అంగుళాలు లేదా 14.6 అంగుళాల రెండు డిస్ప్లే ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. జెస్చర్ కంట్రోల్ పవర్ టెయిల్‌గేట్, డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో రానున్నాయి.
పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు అలాగే హైబ్రిడ్ వెర్షన్
ఇంజన్ పరంగా చూస్తే, ఈ మూడో తరం క్రెటాలో 1.2 లీటర్ టర్బో పెಟ್ರోల్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత ఇందులో 1.5 లీటర్ ఇంజిన్ ఆధారిత హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది. హైబ్రిడ్ వేర్యంట్ రావడం వల్ల కస్టమర్లకు మరింత మెరుగైన మైలేజ్ లభించనుంది. అయితే అధికారికంగా ఇంజిన్ స్పెసిఫికేషన్లపై కంపెనీ నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
అంచనా ధర అలాగే మార్కెట్లో పోటీ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ నయా జనరేషన్ హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.11.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇప్పటికే గట్టి పోటీని ఎదుర్కొంటున్న మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలకు ఈ కొత్త క్రెటా మరింత గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పండుగ సీజన్ తర్వాత ఈ కారు విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




