Toyota Fortuner: కొత్త లుక్, తొలిసారి ADAS ఫీచర్లు.. 11 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో ఫార్చ్యూనర్

గత 11 ఏళ్లుగా పెద్ద మార్పులు లేకుండా అమ్ముడవుతున్న టయోటా ఫార్చ్యూనర్ త్వరలోనే కొత్త అవతారంలో రాబోతోంది.

CR Reddy
Published on: 28 Nov 2026 10:09 AM IST
Toyota Fortuner: కొత్త లుక్, తొలిసారి ADAS ఫీచర్లు.. 11 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో ఫార్చ్యూనర్
X

Toyota Fortuner: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్ త్వరలోనే సరికొత్త అవతారంలో ప్రపంచం ముందుకు రాబోతోంది. గత 11 ఏళ్లకు పైగా చెప్పుకోదగ్గ పెద్ద మార్పులు లేకుండానే ఈ ఎస్‌యూవీ రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మోడల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికా మీడియా కథనాల ప్రకారం, వచ్చే వారం అంటే డిసెంబర్ 1, 2026న కొత్త ఫార్చ్యూనర్ గ్లోబల్ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవలే అర్జెంటీనా రోడ్లపై (అక్కడ దీన్ని SW4 పేరుతో విక్రయిస్తారు) ఈ కారు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. కొత్త టయోటా హైలక్స్ తరహాలో ఇందులో 5 భారీ మార్పులు ఉండబోతున్నాయి.

1. ప్రీమియం ఇంటీరియర్.. తొలిసారి ADAS భద్రతా ఫీచర్లు

కొత్త ఫార్చ్యూనర్ లోపలి భాగం (క్యాబిన్) పూర్తిగా మారిపోనుంది. కొత్త హైలక్స్ మాదిరిగానే ఇందులో 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రానున్నాయి. వీటితో పాటు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 8-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, కొత్త డిజైన్ డ్యాష్‌బోర్డ్ ఉండబోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఫార్చ్యూనర్ చరిత్రలో తొలిసారిగా అధునాతన అడాస్ సేఫ్టీ ఫీచర్లను అందించనున్నారు.

2. మరింత పవర్ఫుల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్

కొత్త మోడల్‌లో ప్రస్తుతం ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 204 bhp శక్తిని, మాన్యువల్ గేర్‌బాక్స్‌లో 420 Nm, ఆటోమేటిక్ వెర్షన్‌లో 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2025 జూన్‌లో టయోటా పరిచయం చేసిన 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఈ కొత్త ఫార్చ్యూనర్‌లోని మరిన్ని వేరియంట్లలో అందించనున్నారు. దీనివల్ల మైలేజీతో పాటు పికప్ కూడా మెరుగవుతుంది. విదేశీ మార్కెట్లలో 2.4-లీటర్ డీజిల్ ఆప్షన్ కూడా ఉండొచ్చు.

3. సరికొత్త ఎక్స్‌టీరియర్ లుక్.. కనెక్టెడ్ టెయిల్ లైట్లు

టెస్టింగ్ మోడల్ ఫొటోలను గమనిస్తే, కారు ముందు, వెనుక భాగాలను పూర్తిగా రీడిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. కొత్త యాంగులర్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్, సరికొత్త మెష్ గ్రిల్ కారుకు మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్స్ మధ్యలో ఎల్‌ఈడీ లైట్ బార్ రానుంది. అయితే సైడ్ ప్రొఫైల్, విండో డిజైన్‌లో మాత్రం పాత ఫార్చ్యూనర్ ఛాయలే కనిపించనున్నాయి.

4. అప్‌డేటెడ్ ప్లాట్‌ఫామ్.. 2027లో భారత్‌లో లాంచ్

ల్యాండ్ క్రూజర్ 300 లో వాడే TNGA-F ప్లాట్‌ఫామ్‌కు బదులుగా, ప్రస్తుత IMV ప్లాట్‌ఫామ్‌ను మరింత ఆధునీకరించి కొత్త ఫార్చ్యూనర్‌ను నిర్మిస్తున్నారు. అంటే దీని అసలైన బలం అయిన 'ల్యాడర్-ఫ్రేమ్' ఛాసిస్ అలాగే ఉంటుంది. మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం సస్పెన్షన్ మార్పులు, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, 4WD వేరియంట్లో లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్, రియర్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇప్పటివరకు భారత్‌లో 3.3 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైన ఫార్చ్యూనర్ కొత్త జనరేషన్ మోడల్ 2027లో మన దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.34.76 లక్షల నుంచి రూ.50.46 లక్షల వరకు ఉండగా, కొత్త మోడల్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.