Nissan: 259 కి.మీ రేంజ్, 28 నిమిషాల్లో ఫుల్ చార్జ్.. నిస్సాన్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్

Nissan: ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్‎ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి మరో అద్భుతమైన కారును తీసుకువచ్చింది.

CR Reddy
Published on: 24 Sept 2026 10:51 AM IST
Nissan Pixo
X

Nissan Pixo

Nissan: ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్‎ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి మరో అద్భుతమైన కారును తీసుకువచ్చింది. సిటీ ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పిక్సో అనే చిన్న ఎలక్ట్రిక్ కార్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. ముఖ్యంగా నగరాల్లోని రద్దీ రోడ్లు, చిన్న పార్కింగ్ స్థలాలలో సులభంగా డ్రైవ్ చేయడానికి వీలుగా ఈ ఏ-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కారును తీర్చిదిద్దారు. ప్రస్తుతం యూరప్ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ కారు డెలివరీలు 2027 ప్రారంభంలో మొదలుకానుండగా, దీని ధరలు, బుకింగ్ వివరాలను డిసెంబర్ 2026 నాటికి పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.

బ్యాటరీ సామర్థ్యం, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు

ఈ సరికొత్త నిస్సాన్‎ పిక్సో కారులో పవర్ఫుల్ 27.5kWh సామర్థ్యం కలిగిన ఎల్‌ఎఫ్‌పి బ్యాటరీని అమర్చారు. యూరప్‌లో నిస్సాన్‎ నుంచి ఈ బ్యాటరీ టెక్నాలజీతో వస్తున్న తొలి కారు ఇదే కావడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సుమారు 60kW అనగా 82hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. డబ్ల్యూఎల్‌టీపీ నిబంధనల ప్రకారం ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 259 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇందులో 11kW ఏసీ, 50kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని కేవలం 28 నిమిషాల్లోనే 15 నుంచి 80 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

కాంపాక్ట్ డిజైన్, విశాలమైన లగేజ్ స్పేస్

చూసేందుకు చిన్నగా కనిపించినప్పటికీ ఈ కారు లోపల ఇంటీరియర్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఈ కారు పొడవు 3,796mm, వెడల్పు 1,790mm ఉండగా, దీని టర్నింగ్ సర్కిల్ కేవలం 9.9 మీటర్లు మాత్రమే. దీనివల్ల ఇరుకైన సందుల్లో కూడా కారును చాలా సులభంగా టర్న్ చేయవచ్చు. నలుగురు ప్రయాణికులు హాయిగా కూర్చోవడానికి సరిపడా స్థలం ఇందులో ఉంది. దీని వెనుక సీట్లను అవసరానికి తగ్గట్టుగా ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. సీట్లు వెనక్కి జరిపితే 356 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేస్తే లగేజ్ స్పేస్ ఏకంగా 1,221 లీటర్ల వరకు పెరుగుతుంది.

గూగుల్ జెమినీ ఏఐ, మోడ్రన్ స్మార్ట్ టెక్నాలజీ

ఈ కారు ఇంటీరియర్‌ను పూర్తిగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. డ్రైవర్ల కోసం 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేతో పాటు, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో గూగుల్ బిల్ట్-ఇన్, అత్యాధునిక గూగుల్ జెమినీ ఏఐ వాయిస్ అసిస్టెంట్ సదుపాయం లభిస్తుంది. కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా మ్యూజిక్, నేవిగేషన్ వంటి అనేక పనులను సులభంగా చేయవచ్చు. అంతేకాకుండా ఫేస్ ఐడీ ద్వారా డ్రైవర్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా పర్సనల్ సెట్టింగ్స్ లోడ్ అవ్వడం, వన్-పెడల్ డ్రైవింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ కారులో స్టాండర్డ్‌గా వస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.