Dhanteras 2026: పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ కారు.. ధంతేరస్‌కు ఏది కొంటే ఎక్కువ లాభం?

ధంతేరస్ పండుగ సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ కారు కొనాలనే దానికంటే ముందు ఏ ఇంధనంతో నడిచే కారును ఎంచుకోవాలనే విషయం ఆలోచించాలి.

CR Reddy
Published on: 6 Nov 2026 1:29 PM IST
Electric Cars
X

Electric Cars

Dhanteras 2026: ధంతేరస్ పండుగ సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ కారు కొనాలనే దానికంటే ముందు ఏ ఇంధనంతో నడిచే కారును ఎంచుకోవాలనే విషయం ఆలోచించాలి. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కో రకానికి ఒక్కో ప్రయోజనం ఉంది. మీ రోజువారీ ప్రయాణం, బడ్జెట్, కారు వాడే విధానం బట్టి సరైన ఎంపిక చేసుకోవాలి. ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ దూరం ప్రయాణించేవారు సీఎన్‌జీ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునేవారికి ఈవీ ఉపయోగకరంగా ఉంటాయి. అయితే పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ వేరియంట్ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండవచ్చు.

రోజూ ఆఫీసుకు వెళ్తున్నారా?

రోజూ ఎక్కువ దూరం ప్రయాణించని ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు పెట్రోల్ కారు మంచి ఎంపికగా ఉంటుంది. పెట్రోల్ కార్ల ప్రారంభ ధర సాధారణంగా తక్కువగా ఉండటంతో కొనుగోలు సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. నగరాల్లో తక్కువ దూరాలకు ప్రయాణించేవారికి ఈవీ అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా పెట్రోల్ బంకులు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. సర్వీసింగ్ సదుపాయాలు కూడా సులభంగా లభిస్తాయి. అయితే రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంధన ఖర్చు పెరుగుతుంది. అందుకే నెలకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో లెక్క వేసుకుని పెట్రోల్ కారును ఎంచుకోవడం మంచిది.

సీఎన్‌జీ కారు కొంటే డబ్బు ఆదా

తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి సీఎన్‌జీ కార్లు ఉపయోగపడతాయి. అందుకే క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ యజమానులు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్, ఎర్టిగా వంటి మోడళ్ల సీఎన్‌జీ వేరియంట్లు వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ కార్లలో సీఎన్‌జీ అయిపోయినా పెట్రోల్‌తో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దీనివల్ల మార్గమధ్యలో గ్యాస్ బంకు అందుబాటులో లేకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే సీఎన్‌జీ స్టేషన్లు మీ ప్రయాణ మార్గంలో ఉన్నాయో లేదో ముందుగానే చూసుకోవాలి. కొన్ని మోడళ్లలో సీఎన్‌జీ సిలిండర్ వల్ల బూట్ స్పేస్ తగ్గుతుంది.

గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ప్రయాణమా?

గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, తరచూ దూర ప్రయాణాలు చేసేవారు డీజిల్ కార్లను కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించేవారికి తగిన గ్రౌండ్ క్లియరెన్స్, ఇంజిన్ పనితీరు ఉన్న డీజిల్ మోడళ్లు ఉపయోగపడతాయి. మహీంద్రా బొలెరో, స్కార్పియో వంటి కార్లకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంది. డీజిల్ కార్లు ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే కొనుగోలు ధర, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని నగరాల్లో డీజిల్ వాహనాలపై కాలుష్య నిబంధనలు కూడా ఉంటాయి. కాబట్టి మీ ప్రాంతంలో అమల్లో ఉన్న నిబంధనలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా?

పెట్రోల్, డీజిల్ ఖర్చులకు దూరంగా ఉండాలనుకునేవారికి ఎలక్ట్రిక్ కార్లు మరో మంచి ఎంపిక. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంటే రోజువారీ ప్రయాణ ఖర్చు తగ్గించుకోవచ్చు. అయితే కారు కొనేముందు మీ ఇంటి దగ్గర, ఆఫీసు వద్ద, తరచూ ప్రయాణించే మార్గాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో లేదో పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 అక్టోబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా 30,497 రిటైల్ అవుట్‌లెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. అలాగే సీఎన్‌జీ, సీఎన్‌జీ ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధనాలు 8,294 రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉన్నాయి.

మొత్తంగా రోజూ తక్కువ దూరం ప్రయాణించేవారికి పెట్రోల్, ఎక్కువ దూరం తిరిగేవారికి సీఎన్‌జీ, గ్రామీణ ప్రాంతాలు, హైవే ప్రయాణాలకు తగిన డీజిల్ మోడళ్లు, ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం ఉన్నవారికి ఎలక్ట్రిక్ కార్లు అనుకూలంగా ఉండవచ్చు. కారు ధరతో పాటు ఇంధన ఖర్చు, నిర్వహణ, ఛార్జింగ్ లేదా గ్యాస్ సదుపాయాలను కూడా పోల్చి చూసి ధంతేరస్‌కు మీ కొత్త కారును ఎంచుకోండి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.