Renault Duster: భద్రతలో ఢోకాలేని 'డస్టర్'.. ప్రమాదాలను ముందే హెచ్చరించే ఫీచర్.. 5 స్టార్ రేటింగ్ తో కేక పుట్టిస్తోందిగా
Renault Duster: ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్-క్యాప్ క్రాష్ టెస్టుల్లో సరికొత్త రెనాల్ట్ డస్టర్ 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. అటు పెద్దలు, ఇటు పిల్లల సేఫ్టీలోనూ అదరగొట్టింది.
Renault Duster
Renault Duster: భారతీయ రహదారులపై ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితం కానుంది. ఎంతో కాలంగా వాహన ప్రేమికులు ఎదురుచూస్తున్న సరికొత్త రెనాల్ట్ డస్టర్, భద్రతా పరీక్షల్లో తన సత్తా చాటింది. అత్యాధునిక సాంకేతికతతో, పటిష్టమైన నిర్మాణంతో రూపొందిన ఈ వాహనం, కుటుంబ సభ్యులందరికీ కొండంత అండగా నిలుస్తూ భద్రతలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పి వాహన రంగంలో సంచలనం సృష్టిస్తోంది.
భద్రతకు ప్రాధాన్యం..
ఫ్రెంచ్ వాహన దిగ్గజం రెనాల్ట్ తన ప్రతిష్టాత్మక మోడల్ 'డస్టర్'ను 2026 వెర్షన్‌లో అత్యున్నత భద్రతా ప్రమాణాలతో తీర్చిదిద్దింది. ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్-క్యాప్ క్రాష్ టెస్టుల్లో ఈ వాహనం అత్యున్నతమైన 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. పెద్దల రక్షణ విభాగంలో 32 పాయింట్లకు గాను 30.49 పాయింట్లు సాధించి అజేయంగా నిలిచింది. కేవలం పెద్దలకే కాకుండా, చిన్న పిల్లల భద్రతలోనూ 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించడం విశేషం.
పటిష్టమైన నిర్మాణం - గ్లోబల్ ప్లాట్‌ఫామ్..
ఈ వాహనాన్ని 'ఆర్.జి.ఎమ్.పి' అనే అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే నిర్మాణం గతంలో యూరోపియన్ భద్రతా పరీక్షల్లో కూడా 5 స్టార్ రేటింగ్‌ను పొంది తన పటుత్వాన్ని నిరూపించుకుంది. వాహనం ముందు భాగం నుంచి లేదా పక్కల నుంచి ప్రమాదం సంభవించినా, లోపల ఉన్న ప్రయాణికుల ముఖ్య భాగాలకు ఎలాంటి హాని కలగకుండా ఈ నిర్మాణం రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముఖ్యంగా డ్రైవర్ ఛాతీ, తల, మెడ భాగాలకు గరిష్ట రక్షణ లభిస్తుందని పరీక్షల్లో తేలింది.
ఆధునిక భద్రతా హంగులు..
వినియోగదారుల ప్రాణాలకు విలువనిస్తూ రెనాల్ట్ ఈ వాహనంలో అనేక రక్షణ ఫీచర్లను జోడించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రెండవ స్థాయి స్వయంప్రతిపత్తి కలిగిన డ్రైవింగ్ సహాయక వ్యవస్థ (ADAS), అత్యవసర సమయాల్లో వాటంతట అవే పడే బ్రేకులు, వాహనం చుట్టూ ఉన్న దృశ్యాలను చూపించే 360-డిగ్రీల కెమెరా వంటివి ఇందులో ఉన్నాయి. ఇవి ప్రమాదాలను ముందే పసిగట్టి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.
శక్తివంతమైన ఇంజన్, ధర వివరాలు..
సామర్థ్యం విషయంలోనూ డస్టర్ ఎక్కడా తగ్గలేదు. ఇది మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లు అద్భుతమైన శక్తిని అందిస్తాయి. త్వరలో రానున్న హైబ్రిడ్ వెర్షన్ పర్యావరణ హితంగా ఉండనుంది. ఇంతటి అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ వాహనం ధర రూ.10.49 లక్షల నుంచి రూ.17.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. భద్రతతో కూడిన స్టైలిష్ ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.




