Renault Duster: లీటర్‌కు ఏకంగా 26 కిమీ మైలేజ్.. అక్టోబర్ 17న భారత్‌లో కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ లాంచ్

Renault Duster: ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన రెనాల్ట్ భారతీయ మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది.

CR Reddy
Published on: 26 Sept 2026 8:54 AM IST
Renault Duster
X

Renault Duster

Renault Duster: ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన రెనాల్ట్ భారతీయ మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది. తన పాపులర్ ఎస్‌యూవీ అయిన డస్టర్ హైబ్రిడ్ వెర్షన్‌ను అక్టోబర్ 17న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఒకప్పుడు డీజిల్ ఇంజిన్లతో భారీ విజయాలను అందుకున్న రెనాల్ట్, ఇప్పుడు అదే స్థానంలో ఈ అధునాతన E-Tech స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీని తదుపరి తరపు మార్పుగా తీసుకువస్తోంది.

అద్భుతమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్

ఈ కొత్త డెస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో 1.8-లీటర్ (1789cc) 4-సిలండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, మల్టీ-మోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అమర్చారు. ఈ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా కారు ఏకంగా 160 hp పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను వాడారు. ప్రత్యేకత ఏమిటంటే సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేటప్పుడు ఈ కారు సుమారు 80 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడిచే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. దీనికి ప్రత్యేకంగా బయటి నుంచి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా బ్యాటరీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది.

లీటర్‌కు 26 కిమీ మైలేజ్

భారత మార్కెట్లో పాత డెస్టర్‌కు ఉన్న డీజిల్ ఆప్షన్ లేని లోటును ఈ హైబ్రిడ్ వెర్షన్ పూర్తిగా భర్తీ చేయనుంది. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే కస్టమర్ల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నివేదికల ప్రకారం, ఈ హైబ్రిడ్ ఇంజిన్ లీటర్‌కు దాదాపు 26 కిమీ వరకు మైలేజ్ ఇచ్చే సత్తా కలిగి ఉంది. కుటుంబాలతో సుదూర ప్రయాణాలు చేసే వారికి, మైలేజ్ లవర్లకు ఈ ఎస్‌యూవీ ఎంతో అనుకూలంగా ఉండనుంది.

ఎవరితో పోటీ?

భారత మార్కెట్లో ఈ రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ కారు.. మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి ప్రముఖ హైబ్రిడ్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆయా కార్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ.16.5 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉన్నాయి. రెనాల్ట్ కూడా ఇదే రేంజ్‌లో ధరలను నిర్ణయించే అవకాశం ఉంది. అక్టోబర్ 17న జరిగే లాంచ్ ఈవెంట్‌లో దీనికి సంబంధించిన పూర్తి ధరలు, మైలేజ్ వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.