Renault : భారత ఆటో మార్కెట్లో రెనాల్ట్ బిగ్ ప్లాన్.. త్వరలో దింపనున్న రెండు బ్రహ్మాస్త్రాలు
Renault : ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లోకి రెండు కొత్త హైబ్రిడ్ SUVలను లాంచ్ చేయబోతోంది.
Renault India
Renault : ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు భారీ వ్యూహాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీయ మార్కెట్‌లో మొత్తం ఏడు కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మోడళ్ల కోసం ప్రత్యేకంగా రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌లను రూపొందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌ల ఆధారంగా పెట్రోల్-డీజిల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో నడిచే కార్లు తయారవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ రెండు పెద్ద హైబ్రిడ్ కార్లను లాంచ్ చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఒకటి ఐకానిక్ డస్టర్ హైబ్రిడ్ కాగా, మరొకటి డస్టర్ ఆధారిత 7-సీటర్ SUV కావడం విశేషం.
శక్తివంతమైన స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ వివరాలు
రాబోయే రెనాల్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీల్లో 1.8-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఈ ఇంజిన్ 109bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి అదనంగా 49bhp పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్, 1.4kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అనుసంధానించబడి ఉంటాయి. ఈ సిస్టమ్‌లో 20bhp సామర్థ్యం గల స్టార్టర్ జెనరేటర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి మొత్తంగా 160bhp పవర్, 172Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తాయి. మైలేజీని విపరీతంగా పెంచేందుకు ఇందులో క్లచ్‌లెస్ మల్టీ-మోడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.
రెనాల్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ఈ కార్లలోని హైబ్రిడ్ టెక్నాలజీ ఎంతో వినూత్నంగా పనిచేస్తుంది. కారు స్టార్ట్ బటన్ నొక్కగానే ఎలక్ట్రిక్ మోటార్ నేరుగా చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. దీనివల్ల ఎలాంటి శబ్దం లేకుండా, ఒక్క చుక్క ఇంధనం కూడా ఖర్చు కాకుండా కారు వెంటనే స్టార్ట్ అవుతుంది. నగరంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో 80 శాతం సమయం కారు ఈవి మోడ్‌లోనే నడుస్తుంది. డ్రైవర్ వేగంగా యాక్సిలరేటర్ నొక్కినప్పుడు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, స్టార్టర్ జెనరేటర్ కలిసి పనిచేసి 160bhp పూర్తి పవర్‌ను ఇస్తాయి. హైవేల్లో ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు పెట్రోల్ ఇంజిన్ ప్రధానంగా పనిచేస్తుంది.
మోడర్న్ డిజైన్, ఫీచర్లు, 3-రో SUV లాంచ్ టైమ్‌లైన్
డిజైన్ పరంగా చూస్తే రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ కారు సాధారణ పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటుంది. కేవలం వెనుక వైపు Hybrid అనే ప్రత్యేక బ్యాడ్జింగ్ మాత్రమే లభిస్తుంది. కార్ లోపల అత్యాధునిక ఫీచర్లు, మోడర్న్ టెక్నాలజీతో కూడిన ప్రీమియం కేబిన్ అందుబాటులో ఉంటుంది. డస్టర్ హైబ్రిడ్ తర్వాత, రెనాల్ట్ సంస్థ 2027 నాటికి 3-రో (7-సీటర్) పెద్ద ఎస్‌యూవీని మార్కెట్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో దీనిని రెనాల్ట్ బోరియల్ పేరుతో ప్రదర్శించినప్పటికీ, భారతీయ వెర్షన్ డిజైన్, ఫీచర్ల పరంగా కొంత భిన్నంగా, ఎక్కువ పొడవు, విశాలమైన కేబిన్ స్పేస్‌తో రానుంది.




