Electric Scooter: షోరూంలకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంటి నుంచే ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ రివర్ మోబిలిటీ తమ ఫ్లాగ్‌షిప్ స్కూటర్ ఇండీని ఇకపై ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది.

CR Reddy
Published on: 9 Oct 2026 9:15 AM IST
River Indie Electric Scooter
X

River Indie Electric Scooter

Electric Scooter: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ రివర్ మోబిలిటీ భారత మార్కెట్లో వేగంగా దూసుకుపోతోంది. ఈ కంపెనీ విక్రయిస్తున్న ఏకైక మోడల్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశవ్యాప్తంగా భారీ ఆదరణ పొందుతోంది. గత జులై నెలలోనే అత్యధిక అమ్మకాలు సాధించి దేశంలో టాప్-10 ఈవీ కంపెనీల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. ఇప్పుడు తమ వాహనాన్ని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టింది.

ఇంట్లో నుంచే బుకింగ్

ప్రస్తుతం రివర్ మోబిలిటీకి దేశవ్యాప్తంగా 48 నగరాల్లో 80కి పైగా ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లు ఉన్నాయి. అయినప్పటికీ కస్టమర్లు షోరూమ్‌ దాకా వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారానే ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. యాప్‌లో పూర్తి మొత్తాన్ని చెల్లించి ఆర్డర్ చేస్తే చాలు. ఆ తర్వాత మిగిలిన ఇన్సూరెన్స్, ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్ ప్రక్రియలతో పాటు వాహన డెలివరీ బాధ్యతలను వినియోగదారుడికి దగ్గర్లోని డీలర్‌షిప్ పూర్తి చేస్తుంది.

సాంకేతిక వివరాలు, మంచి రేంజ్

రివర్ ఇండీ స్కూటర్ సామాన్యుడికి నిత్య జీవితంలో ఉపయోగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి రూపుదిద్దుకుంది. ఇందులో 4kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. ఒకసారి సంపూర్ణంగా ఛార్జ్ చేస్తే ఏకంగా 163 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. వస్తువులు పెట్టుకోవడానికి సీటు కింద 55 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం విశేషం.

ధర, మార్కెట్ పోటీ

భారత మార్కెట్లో రివర్ ఇండీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.57 లక్షలుగా ఉంది. ఇదే ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ వాహనం అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. మన మార్కెట్లో ప్రాచుర్యం పొందిన టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 సిరీస్ మోడళ్లకు ఈ స్కూటర్ నేరుగా సవాలు విసురుతోంది. యమహా కంపెనీ కోసం రివర్ మోబిలిటీ తయారుచేసే EC-06 మోడల్ కూడా ఈ స్కూటర్ డిజైన్ ఆధారంగానే రావడం విశేషం.

పెరుగుతున్న ఆన్‌లైన్ ట్రెండ్

వాహనాలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్, జావా యెజ్డీ, ఏథర్ ఎనర్జీ, హీరో విడా వంటి ప్రముఖ బ్రాండ్లు ఆన్‌లైన్ ఇ-కామర్స్ వేదికలపై తమ వాహనాలను విక్రయిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత రెగ్యులర్ సర్వీసింగ్, వారంటీ సంబంధిత సేవలను కూడా సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లే అందిస్తాయి. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం ద్వారా రాబోయే రోజుల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.