Royal Enfield: హిమాలయన్ 440 వచ్చేసింది.. సరికొత్త లుక్, పవర్ ఫుల్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Royal Enfield: భారతదేశంలో రోడ్లపై రాజసం ఒలకబోసే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి ఒక దశాబ్దం పూర్తయింది.

CR Reddy
Published on: 5 Sept 2026 9:33 AM IST
Royal Enfield
X

Royal Enfield

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్లకు గుడ్ న్యూస్. భారతదేశంలో రోడ్లపై రాజసం ఒలకబోసే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి ఒక దశాబ్దం పూర్తయింది. ఈ స్పెషల్ మైలురాయిని జరుపుకోవడానికి కంపెనీ ప్రత్యేకంగా హిమాలయన్ 440ని తీసుకొచ్చింది. పాత హిమాలయన్ 411 సాధించిన అపారమైన ప్రజాదరణను గుర్తుచేస్తూ రూపొందించిన ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హిమాలయన్ 450 స్థానాన్ని భర్తీ చేయడం కోసం కాకుండా, రెండు మోడళ్లను పక్కపక్కనే విక్రయించనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రారభ ఉత్పత్తి బైక్‌ల ఫ్యూయల్ ట్యాంక్‌పై ప్రత్యేకంగా 10వ వార్షికోత్సవ బ్యాడ్జ్ ఉండటం విశేషం.

మెరుగైన గేర్‌బాక్స్ పెర్ఫార్మెన్స్

కొత్త హిమాలయన్ 440 బైక్‌లో పవర్ఫుల్ 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 6,250 ఆర్పీఎమ్ వద్ద 25.4 బీహెచ్‌పీ పవర్, 4,000 ఆర్పీఎమ్ వద్ద 34 ఎన్ఎమ్ టార్క్‌ను నిరాటంకంగా ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానంగా సరికొత్త 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. నగరాల్లో తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు సులభంగా గేర్లు మార్చేలా, హైవేలపై హాయిగా లాంగ్ రైడ్ చేసేలా దీని రేషియోలను మార్చారు. వాహనంలో వైబ్రేషన్లు తగ్గించి రైడింగ్ అనుభూతిని మరింత సౌకర్యవంతంగా మార్చడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ట్రావెల్ ఫ్రెండ్లీ డిజైన్.. అడ్వెంచర్ లుక్స్

ఆఫ్ రోడ్ రైడింగ్ ఇష్టపడే వారి కోసం ముందూ వెనుక భాగాల్లో వరుసగా 21 ఇంచులు, 17 ఇంచుల స్పోక్ వీల్స్ అందించారు. ఎంతటి గతుకుల రోడ్డుపైనైనా హాయిగా వెళ్లేందుకు వీలుగా 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. రైడర్లు సౌకర్యవంతంగా కూర్చునేలా సీటు ఎత్తును 800 మిమీగా నిర్ధారించారు. పొడవైన ప్రయాణాల కోసం 15 లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్ కేటాయించారు. ముందు భాగంలో 300 మిమీ, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేకులతో పాటు ఆఫ్ రోడ్లలో స్విచ్ చేసుకునే వీలున్న డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ అమర్చారు.

కొత్త డిజిటల్ కన్సోల్.. స్పెషల్ కలర్ ఆప్షన్లు

రైడర్ల సౌకర్యార్థం ఇందులో నెవిగేషన్ సదుపాయంతో పాటు యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టు ఉన్న డిజిటల్-ఎనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కేటాయించారు. ఈ బైక్ సెలా బ్లాక్, మస్టాంగ్ బ్రౌన్, నెలాంగ్ వైట్ అనే మూడు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వీటికి తోడు హ్యాండ్ గార్డులు, ఇంజిన్ గార్డులు, లగేజ్ బాక్సులు లాంటి విభిన్న రకాల ఆక్సెసరీలను కంపెనీ ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3.2 లక్షలకు పైగా హిమాలయన్ మోడళ్లు అమ్ముడైనట్లు సమాచారం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story