Skoda Octavia RS: 4 సెకన్లలో 100 స్పీడ్.. క్షణాల్లో ఔట్ ఆఫ్ స్టాక్.. ఈ కార్‌లో అంత స్పెషల్ ఏంటబ్బా..?

Skoda Octavia RS: స్పోర్ట్స్ కార్ల ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. గతంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఆక్టావియా ఆర్ఎస్ మోడల్‌ను తిరిగి భారత్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Venkat
Published on: 19 Aug 2026 10:42 AM IST
Skoda Octavia RS
X

Skoda Octavia RS: 4 సెకన్లలో 100 స్పీడ్.. క్షణాల్లో ఔట్ ఆఫ్ స్టాక్.. ఈ కార్‌లో అంత స్పెషల్ ఏంటబ్బా..?

Skoda Octavia RS: దేశీయ మార్కెట్లో స్కోడా కార్లకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఆక్టావియా ఆర్ఎస్ మోడల్ అంటే స్పీడ్ లవర్స్ అమితమైన ఆసక్తి చూపిస్తారు. స్లావియా, సూపర్బ్ వంటి కొత్త కార్లను ఆవిష్కరించిన కార్యక్రమంలోనే.. భారత్‌లోని స్పోర్ట్స్ కార్ల ఫ్యాన్స్ కోసం మరో 50 ఆక్టావియా ఆర్ఎస్ కార్లను తీసుకువస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

గతంలో తీసుకొచ్చిన బ్యాచ్‌లు క్షణాల్లో అమ్ముడుపోయాయి. కొనుగోలు చేసే అవకాశం కోల్పోయిన వారందరి కోరిక నెరవేర్చేందుకే ఈ కొత్త బ్యాచ్‌ను సిద్ధం చేశారు. కేవలం 50 కార్లు మాత్రమే మార్కెట్లోకి రానుండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది.

అందుకే కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించి బుక్ చేసుకోవడం ఉత్తమం. విదేశీ మార్కెట్లలో లభించే స్టాండర్డ్ ఆక్టావియా ఆధారంగానే ఈ పవర్ ఫుల్ వెర్షన్‌ను రూపొందించారు. భారత్‌లో సాధారణ సెడాన్ మోడల్ అమ్మకాలు నిలిపివేసినప్పటికీ, ఆర్ఎస్ వెర్షన్‌ను మాత్రం ఇలా పరిమిత సంఖ్యలో తీసుకొస్తున్నారు.

సూపర్ ఫాస్ట్.. పవర్ ఫుల్ ఇంజిన్..

ఈ కారు ప్రధాన ఆకర్షణ దీని ఇంజిన్ సామర్థ్యం. ఇందులో 2-లీటర్ టర్బో పెట్రోల్ (TSI) ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఏకంగా 265 PS పవర్ తో పాటు 370 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్కోడా ప్రత్యేకంగా రూపొందించిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (DSG) ద్వారా ముందు చక్రాలకు శక్తి అందుతుంది.

దీని వేగం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం 6.4 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వల్ల గేర్లు మారుస్తున్నప్పుడు వచ్చే పాప్స్ అండ్ బ్యాంగ్స్ సౌండ్.. అచ్చమైన స్పోర్ట్స్ కారు నడుపుతున్న అనుభూతిని ఇస్తుంది.

అదుర్స్ అనిపించే ఫీచర్లు..

ఆక్టావియా ఆర్ఎస్ బయటి డిజైన్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో.. లోపలి ఫీచర్లు కూడా అంతే అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్డ్-అవుట్ స్కోడా అక్షరాలు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. క్యాబిన్ లోపల 12.9-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే పొందుపరిచారు.

వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 12 స్పీకర్ల క్యాంటన్ సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. భద్రత పరంగా ఇందులో ఏకంగా 10 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు. ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీల కెమెరా లాంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయి.

ధర.. పోటీ ఎలా ఉందంటే?

ప్రస్తుతం మార్కెట్లో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ధర రూ.49.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ ధరల శ్రేణిలో స్వచ్ఛమైన స్పోర్ట్స్ కార్లను విక్రయించే సంస్థలు లేకపోవడం స్కోడాకు అతిపెద్ద సానుకూలాంశం. దీనికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రత్యర్థి మోడల్ లేదు. అందువల్ల ఈ 50 కార్లు త్వరగా బుక్ అయిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

భారతదేశంలో స్పోర్ట్స్ కార్లకు పెరుగుతున్న ఆదరణకు ఆక్టావియా ఆర్ఎస్ క్రేజ్ ఒక ఉత్తమ ఉదాహరణ. ఇది కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా.. దేశీయ ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్తులో స్కోడా బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story