Skoda Slavia: కొత్త డిజైన్, 8 స్పీడ్ గేర్‌బాక్స్‌.. కొత్త అవతారంలో వచ్చేసిన స్కోడా స్లావియా

Skoda Slavia: దేశీయ సెడాన్ ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు స్కోడా సంస్థ సరికొత్త రూపంలో ముందుకు వచ్చింది.

CR Reddy
Published on: 19 Aug 2026 8:46 AM IST
Skoda Slavia
X

Skoda Slavia

Skoda Slavia: కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్ మొత్తానికి మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ నూతన కార్లను ఐదు సాధారణ వేరియంట్లతో పాటు అత్యంత ప్రీమియం లుక్ ఇచ్చే మోంటే కార్లో ట్రిమ్‌లో అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఏకంగా 10 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లను అందిస్తున్నారు. ఆర్కిటిక్ సిల్వర్, క్యాపుచినో బైజ్ రంగులు ఈ మోడల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కొత్త ఫ్రంట్ గ్రిల్, మెరుగైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లతో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టినీ ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.

హైటెక్ ఫీచర్లు.. ప్రీమియం కేబిన్

కారు లోపలి భాగంలో డాష్‌బోర్డ్ రూపురేఖలను పాత మోడల్ తరహాలోనే ఉంచినప్పటికీ, సాంకేతికంగా అనేక విప్లవాత్మక మార్పులు చేశారు. డ్రైవర్ సౌకర్యార్థం 10.25 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే కన్సోల్‌ను అమర్చారు, ఇది టర్న్ బై టర్న్ నేవిగేషన్‌ను స్పష్టంగా చూపిస్తుంది. వినోదం కోసం 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వ్యవస్థలకు సపోర్ట్ చేస్తుంది. ఇరుకైన ప్రదేశాల్లో కారును సులభంగా పార్కింగ్ చేయడానికి వీలుగా 360 డిగ్రీల కెమెరా వ్యవస్థను కూడా ఈ కొత్త వర్షన్‌లో జోడించారు.

సరికొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

ఇంజిన్ పనితీరు, ప్రయాణ అనుభవం విషయంలో స్కోడా ఎక్కడా తగ్గేదే లేదంటోంది. 1.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్‌తో పాటు సరికొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పరిచయం చేశారు. ఈ ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్‌ను నిరాటంకంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో కూడా లభ్యమవుతుంది. మరింత శక్తివంతమైన డ్రైవింగ్ కోరుకునే వారి కోసం 1.48 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే 1.5 లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్ ఆప్షన్ కూడా సిద్ధంగా ఉంది.

సేఫ్టీకి ప్రాధాన్యత.. మిస్సింగ్ ఫీచర్లు ఇవే

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, సింగిల్ పాన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి హంగులన్నింటినీ యథాతథంగా కొనసాగించారు. అధునాతన అడాస్ (ADAS) టెక్నాలజీ, వెనుక సీట్లకు వెంటిలేషన్ ఫీచర్లు లేకపోవడం కాస్త లోటుగా అనిపించినప్పటికీ, డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా ఈ కారు విభాగంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. ధరల వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story