Skoda: నయా లుక్‎తో సెడాన్ లవర్స్‌కు పండుగే.. ఆగస్టు 18న రోడ్డెక్కనున్న స్కోడా నయా సెన్సేషన్

Skoda: ప్రస్తుతం భారత మార్కెట్లో స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 18.19 లక్షల వరకు ఉంది.

CR Reddy
Published on: 15 Aug 2026 8:29 AM IST
Skoda Slavia
X

Skoda Slavia

Skoda: కార్ల లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు 18న అధికారికంగా మార్కెట్‌లోకి రాబోతోంది. కొత్త డిజైన్, అధునాతన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లతో ఈ లగ్జరీ సెడాన్ సెగ్మెంట్‌లో సరికొత్త హంగామా సృష్టించడానికి సిద్ధమైంది. మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్కోడా స్లావియా ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఫేస్‌లిఫ్ట్ రూపంలో మెరవడానికి సిద్ధమైంది. కంపెనీ విడుదల చేసిన టీజర్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్పై చిత్రాల ప్రకారం ఈ నయా మోడల్‌లో ముందరి భాగం పూర్తి కొత్తదనంతో అలరించనుంది. సరికొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌లాంప్‌లు, కొత్త ఫాగ్ లాంప్ హౌసింగ్‌తో పాటు కొత్త బంపర్‌ను అమర్చారు. కుషాక్ మోడల్ మాదిరిగానే గ్రిల్‌లో లైటింగ్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది. సరికొత్త అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

ఇంటీరియర్, కేబిన్ విశేషాలు

కారు లోపలి భాగం గురించి మాట్లాడితే.. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ పాత మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ కేబిన్‌ను మరింత లగ్జరీగా తీర్చిదిద్దారు. డ్రైవర్ సమాచారం కోసం పెద్దదైన 10.25-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. నయా సీట్ అపోల్స్టరీ కారు లోపల రీఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ ఏడాదినాటి కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో అందించిన వెనుక సీట్ల మసాజ్ ఫీచర్‌ను ఇందులో కూడా ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఇందులో కొనసాగుతున్నాయి.

పవర్‌ఫుల్ ఇంజిన్.. నయా గేర్‌బాక్స్

ఇంజిన్ పనితీరులో స్కోడా తన పాత నమ్మకమైన లైనప్‌నే ఉపయోగిస్తోంది. 115 హెచ్‌పీ పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 150 హెచ్‌పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే 1.0-లీటర్ ఇంజిన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ విభాగంలో పెద్ద మార్పు జరిగింది. పాత 6-స్పీడ్ AQ250 స్థానంలో ఇప్పుడు అత్యంత వేగవంతమైన 8-స్పీడ్ AQ300 ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకొస్తున్నారు. పవర్‌ఫుల్ 1.5 TSI ఇంజిన్‌తో యథావిధిగా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కొనసాగుతుంది.

ధర ఎంత ఉండొచ్చు? పోటీ ఎవరితో?

ప్రస్తుతం భారత మార్కెట్లో స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 18.19 లక్షల వరకు ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో తీసుకొచ్చిన కాస్మోటిక్ మార్పులు, అధునాతన గేర్‌బాక్స్ సాంకేతికత కారణంగా ధరల్లో స్వల్పంగా పెరుగుదల ఉండే అవకాశం ఉంది. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ కార్ హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి ఇతర ప్రముఖ సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. స్టైలిష్ లుక్, మెరుగైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఆగస్టు 18న జరగబోయే అధికారిక లాంచ్ రోజున దీని పూర్తి ధరలు, ఇతర వేరియంట్ వివరాలు వెల్లడి కానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story