Small Cars: చిన్న కార్లకు మళ్లీ పెరిగిన డిమాండ్.. ఎస్‍యూవీల హవాకు చెక్ పడినట్లేనా?

Small Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న ఎస్‌యూవీల జోరుకు పోటీగా చిన్న కార్లు మళ్లీ పుంజుకుంటున్నాయి.

CR Reddy
Published on: 4 Sept 2026 8:52 AM IST
Small Cars
X

Small Cars

Small Cars: దేశీయ ఆటోమొబైల్ రంగంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎస్‌యూవీల హవా స్పష్టంగా కనిపించింది. ప్యాసింజర్ కార్లు, చిన్న వాహనాల అమ్మకాలు బాగా మందగించడంతో చాలా కంపెనీలు ఎస్‌యూవీల తయారీపైనే దృష్టి సారించాయి. అయితే ప్రస్తుతం భారత కార్ల మార్కెట్ తీరు మారుతోంది. కేవలం ఎస్‌యూవీలు మాత్రమే కాకుండా అన్ని కేటగిరీల కార్లకు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తోందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) వార్షిక సమావేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు వెల్లడించాయి. ప్రతి విభాగానికి చెందిన వాహనాలకు డిమాండ్ పుంజుకోవడం శుభపరిణామమని పేర్కొన్నాయి.

దిగ్గజ సంస్థల ప్రతినిధుల ఆసక్తికర వ్యాఖ్యలు

గత రెండు మూడేళ్లుగా కార్ల అమ్మకాల వృద్ధి ప్రధానంగా ఎస్‌యూవీల మీదే ఆధారపడి సాగిందని, ఇప్పుడు ప్రతి విభాగంలోనూ వ్యాపారం పుంజుకుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గర్గ్ అభిప్రాయపడ్డారు. మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ చిన్న కార్ల విపణిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం ఎస్‌యూవీల మార్కెట్ వాటా 57 శాతంగా ఉంటే, మిగిలిన 43 శాతం వాటా నాన్-ఎస్‌యూవీ రంగానిదేనని గుర్తుచేశారు. చిన్న కార్ల శకం ముగిసిపోయిందని భావించిన వారికి ప్రస్తుత సేల్స్ గణాంకాలే సమాధానం చెప్తున్నాయని వివరించారు.

ఆర్థిక సంవత్సరంలో నమోదైన రికార్డు సేల్స్

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఏకంగా 12.7 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 25.9 శాతం వృద్ధి. కస్టమర్లు కార్లు కొనడానికి, పాత వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2030 నాటికి నాన్-ఎస్‌యూవీ మార్కెట్ పరిమాణం ఏకంగా 27 లక్షల వాహనాలకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. జిఎస్టి నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులు కూడా కార్ల కొనుగోళ్లకు ఊతమిచ్చాయని మారుతి సుజుకి సీనియర్ అధికారి వెల్లడించారు. పన్నుల సరళీకరణ వల్ల మధ్యతరగతి వినియోగదారులు కొత్త కార్ల కొనుగోలు వైపు అడుగులు వేస్తున్నారు.

పండుగల సీజన్ పై భారీ ఆశలు

రాబోయే పండుగల సీజన్ నాటికి ఆటో పరిశ్రమ మరింత వేగంగా పుంజుకుంటుందనే ధీమాను కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకు సగటున 4.5 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయని, బుకింగ్స్ సైతం వేగంగా నమోదు అవుతున్నాయని వివరించారు. పసిఫిక్ సముద్ర పరిణామాల వల్ల గ్లోబల్ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, విడిభాగాల ధరలు పెరగడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత కస్టమర్లు మాత్రం వాహనాల కొనుగోలుపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్‌యూవీల ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ చిన్న కార్ల రీఎంట్రీ భారత ఆటో రంగానికి కొత్త కళను తెచ్చిపెట్టింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story