Vehicle Insurance : నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్.. కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Vehicle Insurance : బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిరాకరించేలా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.

CR Reddy
Published on: 5 Aug 2026 8:07 AM IST
Vehicle Insurance
X

Vehicle Insurance

Vehicle Insurance : సుప్రీంకోర్టు వాహనదారులకు సంచలన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. దేశంలో తిరిగే ప్రతి వాహనానికి మోటార్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసేందుకు సుప్రీంకోర్టు పలు కీలకమైన ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా ఉందో లేదో తనిఖీ చేసిన తర్వాతే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే వినూత్న విధానాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ మేర‌కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని ఆదేశించింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఇన్సూరెన్స్ పొందే వరకు ఇంధనాన్ని నిరాకరించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రమేనని, పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని తెలిపింది.

ఏఎన్‌పిఆర్ కెమెరాలతో నేరుగా ఇ-చలానాలు

కేవలం పెట్రోల్ బంకుల్లోనే కాకుండా రోడ్లపై తిరిగే వాహనాలను నిరంతరం పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కోర్టు భావిస్తోంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను కేంద్ర వాహన్ డేటాబేస్, ఇన్సూరెన్స్ డేటాబేస్‌లతో అనుసంధానించాలని ప్రతిపాదించింది. దీని ద్వారా రోడ్లపై స్పీడ్‌గా వెళ్లే బండ్ల ఇన్సూరెన్స్ వివరాలను కెమెరాలు క్షణాల్లో స్క్యాన్ చేస్తాయి. ఒకవేళ బీమా లేకపోతే ఆటోమేటిక్‌గా ఇ-చలానా జారీ అయ్యేలా వ్యవస్థను పునర్నిర్మించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.

ట్రాఫిక్ పోలీసులకు స్పెషల్ మొబైల్ యాప్‌లు

వాహన తనిఖీల సమయంలో వాహనదారులు కాగితాలు చూపించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రోడ్డు తనిఖీల సమయాల్లో ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక మొబైల్ యాప్‌లు లేదా హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌లు అందించాలని సూచించింది. దీనివల్ల బండి నంబర్ నమోదు చేయగానే బీమా ఉందో లేదో పోలీసులకు స్పాట్‌లోనే తెలిసిపోతుంది. ఫిజికల్ డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లే తిప్పలు వాహనదారులకు తప్పుతాయి.

కొత్త వాహనాలకు పెరగనున్న ఇన్సూరెన్స్ కాలపరిమితి

కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కాలపరిమితిని మరింత పెంచాలని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం కొత్త ప్రైవేట్ కార్లకు ఉన్న 3 ఏళ్ల ఇన్సూరెన్స్ కాలపరిమితిని 4 సంవత్సరాలకు, టూ వీలర్స్ ఉన్న 5 ఏళ్ల పరిమితిని 6 సంవత్సరాలకు పొడిగించాలని ప్రతిపాదించింది. తొలిసారి తీసుకునే ఇన్సూరెన్స్ ముగిసిన తర్వాత చాలామంది రీఛార్జ్ లేదా రెన్యూవల్ చేయించుకోకుండానే బండ్లను రోడ్లపై తిప్పుతున్నారు. ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ సుదీర్ఘ కాలపరిమితి ప్రతిపాదనలు చేసినట్లు కోర్టు పేర్కొంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story