Suzuki e SKY Kei EV: సింగిల్ ఛార్జ్‌తో 310 కి.మీ రేంజ్.. సుజుకి చౌకైన ఎలక్ట్రిక్ కారు 'e SKY' లాంచ్
Suzuki e SKY Kei EV: సుజుకి తన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు e SKYని జపాన్‌లో అధికారికంగా ఆవిష్కరించింది.
Suzuki e SKY Kei EV
Suzuki e SKY Kei EV: ఎలక్ట్రిక్ వాహనాల విపణిలోకి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి ఎట్టకేలకు అడుగుపెట్టింది. జపాన్ మార్కెట్లో తన మొట్టమొదటి ప్యాసింజర్ కై ఈవీ కారు e SKYని అధికారికంగా ఆవిష్కరించింది. చైనాకు చెందిన బివైడి రాకో ఈవీ మోడల్ కంటే తక్కువ ధరకు దీనిని ఆఫర్ చేస్తుండటం విశేషం. సుజుకి తయారుచేసిన ఈవీ కార్లలో ఇదే అత్యంత చౌకైన మోడల్‌గా నిలిచింది. సరికొత్త సాంకేతికతతో రూపొందిన ఈ కారు ఎలక్ట్రిక్ వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సుజుకి e SKY సేల్స్ జపాన్ వ్యాప్తంగా 2026 నవంబర్ 16 నుంచి షురూ కానున్నాయి. కంపెనీ దీనిని ఏ, జీ, ఎక్స్ అనే మూడు మోడళ్లలో తీసుకొచ్చింది. బేస్ 'ఏ' మోడల్ ప్రారంభ ధర 21.2 లక్షల యెన్లు (మన దేశీయ కరెన్సీలో సుమారు రూ.13 లక్షలు) కాగా, మిడ్ వేరియంట్ 'జీ' ధర రూ. 14.6 లక్షలు, టాప్ వేరియంట్ 'ఎక్స్' ధర రూ.17 లక్షలుగా నిర్ణయించారు. అంతేకాకుండా జపాన్ ప్రభుత్వం అందించే సబ్సిడీలను వర్తింపజేస్తే బేస్ మోడల్ ఎఫెక్టివ్ ధర కేవలం 15.5 లక్షల యెన్లకు (సుమారు రూ.9.4 లక్షలు) తగ్గిపోతుంది. నెలకు వెయ్యి కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కారు తయారీలో ఒక ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. మార్కెట్లో ప్రత్యర్థిగా ఉన్న చైనీస్ దిగ్గజం బివైడికి చెందిన LFP బ్యాటరీ సెల్స్‌ను సుజుకి ఈ కారులో ఉపయోగించడం విశేషం. సుజుకి సొంతంగా అభివృద్ధి చేసిన HEARTECT-e ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు. ఇందులోని ప్రత్యేక ఈ-యాక్సిల్ డ్రైవ్ సిస్టమ్ వల్ల కారు బరువు తగ్గి ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
కొలతల విషయానికొస్తే ఈ కారు పొడవు 3,395 మిమీ, వెడల్పు 1,475 మిమీ, ఎత్తు 1,625 మిమీగా ఉన్నాయి. ఇందులో 26kWh ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 310 కిలోమీటర్ల సుదీర్ఘ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని WLTC ధృవీకరించింది. ప్రత్యర్థి బివైడి రాకో బేస్ మోడల్ 22.4kWh బ్యాటరీతో కేవలం 210 కిమీ రేంజ్ ఇస్తుండగా, సుజుకి e SKY చిన్న బ్యాటరీతోనే ఏకంగా 310 కిమీ రేంజ్ అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కేవలం 1,030 కేజీల తక్కువ బరువు, ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కారణంగా ఈ కారు బ్యాటరీ శక్తిని అద్భుతంగా వాడుకుంటుంది. సరసమైన ధరలో ఎక్కువ రేంజ్ కోరుకునే జపాన్ వినియోగదారులకు ఈ కారు బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. సమీప భవిష్యత్తులో ఈ మోడల్‌ను ఇతర ఆసియా దేశాల మార్కెట్లలోకి సైతం పరిచయం చేసే ఆలోచనలో సుజుకి ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.




