Tata Aeris: 20 టన్నుల రాళ్లు పడినా చెక్కుచెదరలేదు.. సేఫ్టీలో రికార్డు క్రియేట్ చేసిన టాటా కారు

Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భద్రతకు మారుపేరైన టాటా మోటార్స్ మరో అద్భుతమైన ప్రయోగంతో ముందుకొచ్చింది.

CR Reddy
Published on: 26 Sept 2026 9:11 AM IST
Tata Aeris
X

Tata Aeris

Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భద్రతకు మారుపేరైన టాటా మోటార్స్ మరో అద్భుతమైన ప్రయోగంతో ముందుకొచ్చింది. తాజాగా కంపెనీ తన నూతన సెడాన్ కార్ టాటా ఏరిస్ సేఫ్టీని నిరూపించేందుకు ఒక షాకింగ్ స్టంట్‌ను నిర్వహించింది. ఈ కారుపై ఒక పెద్ద డంప్ ట్రక్కు ద్వారా దాదాపు 20 టన్నుల బరువైన రాళ్లు, మట్టిని నేరుగా పైనుంచి పడేశారు. సాధారణంగా అంత భారీ బరువు పడితే ఏ కారైనా నుజ్జునుజ్జు కావడం ఖాయం. కానీ ఈ విపరీతమైన బరువును కూడా టాటా ఏరిస్ అద్భుతంగా తట్టుకుని నిలబడింది. కారు బాడీ ఫ్రేమ్ చెక్కుచెదరకుండా ఉండటమే కాకుండా, రాళ్ల కింద నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బయటకు కదిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆకర్షణీయమైన ధర, మార్కెట్ పోటీ

భారత మార్కెట్లో ఈ అద్భుతమైన సెడాన్ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.5.29 లక్షలుగా నిర్ణయించారు. తన అసాధారణ బిల్డ్ క్వాలిటీతో వస్తున్న ఈ కారు.. మార్కెట్లో ఇప్పటికే పాపులర్‌గా ఉన్న మారుతి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత కోరుకునే మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ దీనిని అత్యంత వ్యూహాత్మకంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది.

అదిరిపోయే అధునాతన సేఫ్టీ ఫీచర్లు

ఇప్పటివరకు గ్లోబల్ ఎన్ క్యాప్ లేదా భారత్ ఎన్‌క్యాప్ వంటి సంస్థల అధికారిక క్రాష్ టెస్ట్ రేటింగ్స్ రావాల్సి ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కారులోని ప్రయాణికులందరి రక్షణ కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఇన్‌బిల్ట్ డాష్‌కామ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి హై-టెక్ ఫీటర్లను పొందుపరిచారు. వీటితో పాటు హిల్ హోల్డ్ కంట్రోల్, రోల్-ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, చిన్న పిల్లల భద్రత కోసం ISOFIX చైల్డ్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ సామర్థ్యం, పవర్ ట్రెయిన్ వివరాలు

ఇంజిన్, పర్ఫామెన్స్ విషయానికి వస్తే టాటా ఏరిస్ కారులో 1.2-లీటర్ 3 సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 86bhp పవర్‌ను, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, పెట్రోల్‌తో పాటు అద్భుతమైన మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా విడుదల చేశారు. సీఎన్‌జీ మోడల్ 76bhp పవర్, 97Nm టార్క్‌ను అందిస్తూ రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.