Upcoming SUVs: 2027లో టాటా, మహీంద్రా నుంచి 5 అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు.. లాంచ్ ఎప్పుడంటే?
2027లో భారత కార్ల మార్కెట్‌లోకి టాటా మోటార్స్, మహీంద్రా నుంచి ఐదు కొత్త ఎలక్ట్రిక్ SUVలు రాబోతున్నాయి. టాటా సఫారీ EV, అవిన్యా X, కొత్త నెక్సాన్ EVతో పాటు మహీంద్రా BE 07, విజన్ S మోడళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Upcoming SUVs: భారత కార్ల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా SUVలు కొనాలనుకునే వారిలో ఎలక్ట్రిక్ మోడళ్లపై ఆసక్తి కనిపిస్తోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో టాటా మోటార్స్, మహీంద్రా 2027లో ఐదు కొత్త SUVలను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో టాటా నుంచి మూడు మోడళ్లు, మహీంద్రా నుంచి రెండు మోడళ్లు ఉండనున్నాయి. పెద్ద బ్యాటరీలు, ఎక్కువ రేంజ్, ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. టాటా సఫారీ EV
టాటా మోటార్స్ నుంచి రాబోతున్న ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ SUVల్లో సఫారీ EV ఒకటి. ఈ కారును 2027 జనవరిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హారియర్ EV కంటే ఇది పెద్ద SUVగా ఉండనుంది. ముఖ్యంగా మూడు వరుసల సీట్లతో 6, 7 సీట్ల ఆప్షన్లు అందించే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 65kWh, 75kWh ప్యాక్‌లతో పాటు పెద్ద వేరియంట్‌లో 80kWh బ్యాటరీ కూడా రావచ్చని అంచనా. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉండొచ్చు. పెద్ద కుటుంబాలకు ఎలక్ట్రిక్ SUV కావాలనుకునే వారికి ఈ కారు ఆసక్తికరమైన ఎంపికగా మారవచ్చు.
2. టాటా అవిన్యా X
టాటా తీసుకురాబోతున్న మరో ప్రీమియం ఎలక్ట్రిక్ SUV అవిన్యా X. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ మోడల్ కాన్సెప్ట్‌ను కంపెనీ ప్రదర్శించింది. దీని ప్రొడక్షన్ వెర్షన్‌ను 2027లో పరిచయం చేసే అవకాశం ఉంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు చెందిన EMA టెక్నాలజీ ఆధారంగా ఈ SUVని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఇందులో 800V ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే రేంజ్ అందించవచ్చని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, AR హెడ్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ప్రీమియం ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో టాటాకు ఈ కారు కీలకం కానుంది.
3. కొత్త జనరేషన్ టాటా నెక్సాన్ EV
టాటా నెక్సాన్ EVకు దేశీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ కారుకు కొత్త జనరేషన్ మోడల్ తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీన్ని 'గరుడ' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లో ఈ కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ATLAS ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించవచ్చని అంచనా. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. డిజైన్‌లోనూ మార్పులు ఉండనున్నాయి. కొత్త రూఫ్‌లైన్, మారిన టెయిల్‌గేట్, కొత్త అల్లాయ్ వీల్స్ కనిపించవచ్చు. వెనుక సీట్లో ప్రయాణించే వారికి మరింత స్థలం, ఎక్కువ బూట్ స్పేస్ అందించేలా మార్పులు చేయవచ్చని సమాచారం.
4. మహీంద్రా BE 07
మహీంద్రా నుంచి రాబోతున్న మరో ఎలక్ట్రిక్ SUV BE 07. ఈ కారును 2027 జూన్ నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ BE 6 కంటే పైన ఈ మోడల్‌ను ఉంచనుంది. INGLO ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించనున్నారు. 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు అందించే అవకాశం ఉందని సమాచారం. బయటివైపు C-ఆకారంలో LED DRLలు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఉండొచ్చు. లోపల ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మహీంద్రా ఈ SUVని తీసుకురానుంది.
5. మహీంద్రా విజన్ S
మహీంద్రా నుంచి రాబోతున్న ఐదో మోడల్ విజన్ S. దీని ప్రొడక్షన్ వెర్షన్‌ను 2027 తొలి ఆరు నెలల్లో మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కాంపాక్ట్ SUVగా ఉండనుంది. డిజైన్ విషయంలో స్కార్పియో-N తరహా బాక్సీ లుక్ కనిపించవచ్చని అంచనా. ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్స్, వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, వెనుకవైపు స్పేర్ వీల్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు. కంపెనీ కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై ఈ SUVని తయారు చేయనుంది. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లకు అనుకూలంగా ఉంటుంది. అయితే విజన్ S ఎలక్ట్రిక్ వెర్షన్ మార్కెట్‌లోకి వస్తుందా? దాని బ్యాటరీ సామర్థ్యం ఎంత? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
2027లో ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో గట్టి పోటీ
టాటా మోటార్స్, మహీంద్రా నుంచి ఈ ఐదు కొత్త SUVలు అందుబాటులోకి వస్తే భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పోటీ మరింత పెరగనుంది. టాటా సఫారీ EV పెద్ద కుటుంబాలను లక్ష్యంగా చేసుకోనుండగా, నెక్సాన్ EV కొత్త జనరేషన్ మోడల్ ద్వారా ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది. అవిన్యా Xతో ప్రీమియం విభాగంలో టాటా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు మహీంద్రా BE 07, విజన్ Sతో కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. అయితే వీటి ధరలు, ఖచ్చితమైన బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లపై కంపెనీలు అధికారిక ప్రకటనలు చేయాల్సి ఉంది.




