Tata Harrier: పెట్రోల్ వద్దు.. ఈవీయే ముద్దు.. టాటా హారియర్ షాకింగ్ రికార్డు

Tata Harrier: టాటా హారియర్ ఈవీ సాధించిన విజయంతో రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ రంగం పూర్తిగా ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

CR Reddy
Published on: 22 Aug 2026 7:57 AM IST
Tata Harrier
X

Tata Harrier

Tata Harrier: భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతేడాది జులైలో మార్కెట్‌లోకి వచ్చిన టాటా హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లను వెనక్కి నెట్టి ఏకంగా 64 శాతం మంది కొనుగోలుదారుల తొలి ఎంపికగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశీయ కార్ల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి టాటా హారియర్ సేల్స్ గణాంకాలే నిదర్శనం. గత కొన్ని నెలల నుంచి హారియర్ ఎలక్ట్రిక్ మోడల్ అమ్మకాలు, దానికి ఉన్న సాంప్రదాయ డీజిల్ వర్షన్‌ను అధిగమించాయి. జూన్ వరకు అమ్ముడైన మొత్తం హారియర్ కార్లలో 57 శాతానికి పైగా కేవలం ఎలక్ట్రిక్ మోడళ్లే ఉండటం విశేషం. జూన్ నెలలో ఈ సంఖ్య ఏకంగా 64 శాతానికి పెరిగింది. అంటే రోడ్డుపైకి వస్తున్న ప్రతి మూడు హారియర్ కార్లలో రెండు ఎలక్ట్రిక్ మోడళ్లే కావడం గమనార్హం.

ధర విషయానికి వస్తే హారియర్ ఈవీ ప్రారంభ ధర రూ.21.69 లక్షలుగా ఉంటే, పెట్రోల్ మోడల్ రూ.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మొదటి చూపులో ఈ రెండింటి మధ్య ధర వ్యత్యాసం చాలా ఎక్కువగా అనిపించినప్పటికీ టాటా మోటార్స్ అమలు చేసిన తెలివైన వ్యూహం ఈవీ వైపు వినియోగదారులను ఆకర్షించింది. రూ. 20 లక్షలకు పైగా బడ్జెట్ ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, ఈవీ టాప్ మోడల్ ధరలను డీజిల్ టాప్ వేరియంట్ ధరలకు చాలా దగ్గరగా నిర్ణయించింది. దీంతో కొద్దిగా అదనంగా వెచ్చిస్తే అత్యాధునిక ఈవీ సొంతమవుతుందనే ఆలోచనతో కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లకే ప్రాధాన్యతనిస్తున్నారు.

ధరలో ఉన్న చిన్న వ్యత్యాసానికి తగినట్లుగానే ఈవీ మోడల్‌లో వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లు లభిస్తున్నాయి. 75 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 627 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కేవలం 6.3 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు, డీజిల్ మోడల్ కంటే అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది.

హారియర్ ఈవీ రాకతో కేవలం డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గడమే కాకుండా, హారియర్ బ్రాండ్ మొత్తం అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. గతేడాది జులైలో 2,216 యూనిట్లుగా ఉన్న ఈ కారు అమ్మకాలు, ఈ ఏడాది జులై నాటికి 3,301 యూనిట్లకు చేరాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఏకంగా 49 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. నాణ్యమైన రేంజ్, అత్యుత్తమ సేఫ్టీ, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అందిస్తే భారతీయులు ఎలక్ట్రిక్ కార్లను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఘనత నిరూపించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story